ఇంకెనాళ్లొ ఈ ఎదురు చూపులు.. | Double Bedroom Work Pending In mahabubnagar | Sakshi
Sakshi News home page

ఇంకెనాళ్లు ఈ ఎదురు చూపులు..

Published Sat, Oct 26 2019 11:54 AM | Last Updated on Sat, Oct 26 2019 11:56 AM

Double Bedroom Work Pending In mahabubnagar - Sakshi

పై చిత్రంలో కన్పిస్తున్న భవనాల సముదాయం మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని దివిటిపల్లిది. 2015లో 1,100 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. 2018 ఏడాది చివరిలో పూర్తయ్యాయి. రూ.59.40కోట్ల వ్యయంతో అన్ని హంగులతో.. అత్యంత సుందరంగా ఇళ్లు నిర్మించి దాదాపు ఏడాది కావస్తోన్నా ఇంతవరకు అవీ ప్రారంభానికి నోచుకోలేదు. ఆయా ఇళ్లకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు ఇస్తుండడమే ప్రధాన కారణమని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రమణారావు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకు ఆయా ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించకపోవడంతో ఆయా ఇళ్లపై ఆశలు పెట్టుకున్న అర్హులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. నిర్ణయించిన నిర్మాణ రుసుము గిట్టుబాటు కాక ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు గతంలో ముందుకురాలేదు. దీంతో  ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల వైపే మొగ్గు చూపిన అధికారులు తర్వాత కాంట్రాక్టర్లకు గిట్టుబాటు అయ్యేలా పలు చోట్ల జీ ప్లస్‌–టు నిర్మాణాలపై దృష్టిసారించారు. ఫలితంగా పలు చోట్ల స్థలాభావ సమస్యకూ పరిష్కార మార్గం లభించింది. దీంతో ఇకపై పనులు సాఫీగా పూర్తవుతాయని భావించిన అధికారులు పలు మార్లు టెండర్లు పిలిచారు. అయినా కాంట్రాక్టర్లు మాత్రం చాలా చోట్ల పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.

దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు నత్తకునడక నేర్పుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులు, కాంట్రాక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించినా.. నిర్మాణ పనులు మాత్రం ఆశించిన మేరకు జరగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లాకేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణిలో మూడు జిల్లాల నుంచి సుమారు పది వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 

20శాతం దాటని నిర్మాణాలు.. 
క్షేత్రస్థాయిలో రెండుపడక గదుల ఇళ్లకు ఉన్న డిమాండ్, స్థానిక ఎమ్మెల్యేల చొరవతో ప్రభుత్వం మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు మొత్తం 15,352 ఇళ్లు మంజూరు చేసింది. వాటి నిర్మాణాల కోసం రూ.290 కోట్లు మంజూరు చేసింది. కానీ క్షేత్రస్థాయి సమస్యలు, బిల్లుల సమస్యతో ఇప్పటి వరకు కేవలం 2,627 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. మంజూరైన ఇళ్లలో 19శాతం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి.  


 గద్వాల పట్టణ శివారులో ప్లాస్టరింగ్‌ పూర్తయిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు 

మహబూబ్‌నగర్‌ జిల్లాకు మొత్తం 7,713 ఇళ్లు మంజూరయ్యాయి. 7,481 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారులు టెండర్లు పిలిచారు. 6,453 ఇళ్లకు టెండర్ల ఖరారయ్యాయి. ఇందులో 4,768 నిర్మాణాలు ప్రారంభానికి నోచుకుంటే.. ఇప్పటి వరకు కేవలం 2,326 మాత్రమే పూర్తయ్యాయి. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ 156.12కోట్లు కేటాయించింది. మంజూరైన ఇళ్లలో 3,693 గ్రామీణ ప్రాంతాలకు కేటాయిస్తే... 2,593 నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 132 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. పట్టణ  ప్రాంతాలకు 4,020 ఇళ్లు కేటాయిస్తే.. 3,860 నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 2,194 ఇళ్లు పూర్తయ్యాయి.

జడ్చర్ల పట్టణం బోయలకుంట, కావేరమ్మపేటలో 240 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈర్లప్లి, నసరుల్లాబాద్, గైరాన్‌తండా, కుర్వపల్లి గ్రామాల్లో పనులు మొదలు కాలేదు. మిడ్జిల్‌ మండలం వాడ్యాల, కొత్తపల్లి, మసిగుండ్లపల్లి గ్రామాల్లో వంద ఇళ్ల  నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు పడక గదుల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాకపోవడంతో దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి, వెంకటాయపల్లి, రేకులంపల్లి, అజిలాపూర్, పేరూర్‌ గ్రామాల్లో టెండర్లు తీసుకోడానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. అడ్డాకుల మండలం వడ్డేపల్లిలో 32 డబుల్‌ బెడ్‌ రూమ్‌ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.  

జోగుళాంబ గద్వాల జిల్లాకు మొత్తం 2732 డబుల్‌ బెడ్‌ ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు కేవలం 241 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితమే గద్వాల పట్టణంలో 468ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అందుకు రూ.24.78కోట్లు కూడా మంజూరయ్యాయి. జీప్లస్‌–2గా ఒక్కో బ్లాక్‌లో 24 ఇళ్ల చొప్పున 19.5 బ్లాకుల్లో మొత్తం 468 ఇళ్లు స్లాబ్‌లు పూర్తయ్యాయి. ఇందులో 9 బ్లాక్‌లు ప్లాస్టరింగ్‌ పూర్తికాగా మరో మూడు ప్లాస్టరింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఇసుక కొరత, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, బిల్లుల చెల్లింపులో ఆలస్యంతో పనులు వేగంగా సాగలేదు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్లాస్టరింగ్‌ పూర్తయిన తొమ్మిది బ్లాకుల్లో గోడలకు రంగులు వేస్తున్నారు. గద్వాల మండలం గోనుపాడులో రూ.1.57కోట్లతో 25 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అలంపూర్‌ మండలం క్యాతూర్‌లో రూ.1.20కోట్లతో 20 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అన్ని ఇళ్లకు స్లాబ్‌లు వేశారు. ప్లాస్టరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

ఇంటి కోసం ఎదురుచూపులు
నేను, నా భర్త కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఎక్కడా సొంత ఇల్లు గాని కనీసం స్థలం గానీ లేదు. దీంతో నెలకు రూ.1,500 చెల్లించి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. అధికారులు కరుణించి మాకు ఇల్లు మంజూరు చేయాలి. 
– మహేశ్వరి, కుంటవీధి, గద్వాల పట్టణం 

అర్హులకు మాత్రమే ఇవ్వాలి  
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికైనా పూర్తయినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కరెంట్‌ స్తంభాలు పాతి లైన్లు లాగితే పనులు పూర్తవుతాయి. ఇక వీలైనంత త్వరగా మిగతా పనులు పూర్తి చేసి గ్రామంలో నిరుపేదలైన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించాలి. ఉమ్మడి మండలంలో ఎక్కడా పనులు కాకున్నా.. మా గ్రామంలో పూర్తి చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. 
– బత్కయ్య, చెన్నారం, గోపాల్‌పేట  

కొన్ని సమస్యల వల్లే..
ప్రారంభంలో ఇసుక కొరత, విద్యుత్‌ కనెక్షన్, బిల్లులు ఆలస్యంగా రావడంతో పనులు అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. మార్చిలోగా అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం. లబ్ధిదారుల ఎంపిక మా పరిధిలోకి రాదు. 
– రవీందర్, డీఈఈ, పీఆర్, గద్వాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement