చేగుంట: వడియారం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వడియారంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రైల్వే సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే చెరకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తానని, పాఠశాలల ప్రహరీ నిర్మాణంతో పాటు అటెండర్, స్వీపర్ పోస్టుల నియామకం, గ్రామస్థాయి గోదాములకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. కమిటీలో తనకు కేటాయించిన పర్యాటక, రవాణ, ఆరోగ్య, సాంసృ్కతిక విభాగాల గురించి చర్చించి తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానన్నారు.
అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరిస్తా
రామాయంపేట: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన రామాయంపేట వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అజంతా ఎక్స్‌ప్రెస్ అక్కన్నపేటతోపాటు చేగుంట స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారని, ఈదిశగా ప్రయత్నిస్తానన్నారు. అక్కన్నపేట స్టేషన్‌లో స్టాక్ పాయింట్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటానన్నారు.
ఆర్టీసీ బస్సులు గ్రామాలకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఆర్టీసీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కాలేదని, ప్రక్షాళన తరువాత పరిస్థితులు చక్కబడతాయన్నారు. అంతకుముందు ఎంపీ స్థానిక అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్ ఎంపీని సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం ప్రతినిధి గొర్రె వెంకటరెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
వడియారంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా కృషి
Published Mon, Nov 17 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement