
ఎల్లన్న ఇక లేరు
నారాయణపేట రూరల్: జిల్లాలో ఎల్లన్న అని పిలిస్తే పలికే నేతగా.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సుపరిచితులైన మాజీమంత్రి, మక్తల్ మాజీఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కనుమూశారు. భార్య పద్మమ్మ మూడేళ్లక్రితమే చనిపోయారు. ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వార్డుసభ్యుడి నుంచి రాష్ట్రమంత్రి వరకు ఎదిగారు. నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.
1939 అక్టోబర్ 1న ఊట్కూర్ గ్రామానికి చెందిన మున్నురుకాపు ఎల్కొటి ఎంకమ్మ, ఆశన్నలకు ఎల్లారెడ్డి జన్మించారు. చిన్నతనంలోనే తల్లి ఎంకమ్మ మరణించడంతో తల్లిప్రేమకు దూరమయ్యాడు. నాయనమ్మ లక్ష్మమ్మ వద్దే పెరిగాడు. ఎల్లారెడ్డి ప్రాథమిక విద్యను ఊట్కూర్‌లోనే ప్రారంభించారు. హెచ్‌ఎల్‌సీసీ నారాయణపేటలో పూర్తిచేశారు. పీయూసీ హైదారాబాద్‌లోని న్యూసైన్స్ కళాశాలలో చదివారు.
వార్డు సభ్యుడిగా..
గ్రామ రాజీకయాల్లో చురుకుగా పాల్గొంటూ మొట్టమొదటిసారిగా 1965లో గ్రామపంచాయతీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డితో విభేదించి నందమూరి తారకరామరావు సమక్షంలో 1988లో ఎల్లన్న టీడీపీలో చేరారు. రెండు ద ఫాలుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డిపై విజయం సాధించారు.
అయితే టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు వంచన చేరడంతో ఎల్లారెడ్డికి 1997లో మంత్రి పదవి లభించింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సూగప్పపై ఎల్లారెడ్డి 10వేల ఓట్ల మెజార్టీతో నారాయణపేట తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2014లో టీఆర్ ఎస్‌లో చేరిక..
25ఏళ్లుగా టీడీపీలో ఉన్న ఎల్లారెడ్డి మక్తల్ అసెంబ్లీ నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడటంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2014 ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉన్న సమయంలో తన అనుచరులను ఒక్కొక్కరిని తన గూటికి చేర్చుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో అలజడి రేపారు. ఎల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎవరితోనూ ముక్కుసూటిగా మాట్లాడలేదు. కానీ తనను నమ్మినవారి కోసం ఎదుటివాళ్లను మందలిస్తూ పనులు చక్కబెట్టేవారు.