
రేపు ఉద్యోగుల సామూహిక సెలవు
సీపీఎస్ రద్దు కోసం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సీపీఎస్ ఉద్యోగ సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1న నిర్వహించనున్న మాస్ క్యాజువల్ లీవ్‌కు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 28 నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు ప్రారంభించాయి. బుధవారం కూడా టీజీవో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ర్యాలీలు చేశారు. ఈ నెల 31న అన్ని జిల్లా, డివిజన్ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాట్లు చేశాయి. సామూహిక సెలవుకు అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జాక్టోలోని ఎస్టీయూ తదితర భాగస్వామ్య సంఘాలు నేరుగా మాస్ క్యాజువల్ లీవ్‌కు పిలుపునివ్వగా, టీటీజేఏసీలోని పీఆర్‌టీయూ–టీఎస్ తదితర సంఘాలు సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మాస్ క్యాజువల్ లీవ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
సెప్టెంబర్ 1న మ«ధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులంతా మండల విద్యాధికారి కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. ఇక ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలోని యూటీఎఫ్ తదితర సంఘాలు సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లో సామూహిక ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనకు జూనియర్ లెక్చరర్ల సంఘం, డిగ్రీ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీలోని టీజీవో, టీఎన్‌జీవో తదితర సంఘాలు సెప్టెంబర్ 1న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత వారి భరోసా, భద్రతకు విఘాతం కలిగేలా ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌తో దాదాపు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 1వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అయ్యాయి.
ఇవీ ప్రధాన డిమాండ్లు..
– 1.2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భద్రత లేని సీపీఎస్‌ను రద్దు చేయాలి.
– సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలి.
– ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ మంజూరు చేయాలి.
– సీపీఎస్‌లోని ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి పెన్షన్‌ను మంజూరు చేయాలి.