రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
తూప్రాన్ : అన్నదాత నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ వీఆర్‌ఓ ఏబీసీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన తూప్రాన్ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన కూతాడి నరసింహులు రెండేళ్ల కిత్రం సర్వే నంబరు 267లో రెండు గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిని తన భార్య ఎల్లమ్మ పేరు మీద రికార్డుల్లో మార్పు (ముటేషన్) చేయాలని గ్రామ అసిస్టెంట్ వీఆర్‌ఓ దేవయ్యను సంప్రదించాడు. ఇందు కోసం దేవయ్య రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకరించిన రైతు నరసింహులు మొదట్లో రూ.4 వేలు దేవయ్యకు ముట్టజెప్పాడు. అయితే మొత్తం డబ్బులు ఇస్తే గానీ పని పూర్తి చేయనని తెగేసి చెప్పాడు.
రెండు నెలలుగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన రైతు నరసింహులు ఇటీవల సంగారెడ్డిలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మంగ ళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద కాపు కాసి రైతు నరసింహులు రూ. 4 వేలు లంచం ఇస్తుండగా.. దేవయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. ఈ మేరకు దేవయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ వీఆర్‌ఓ
Published Wed, Feb 25 2015 1:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement