ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో | acb officials are caught assistant VRO | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో

Published Thu, Dec 4 2014 1:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో - Sakshi

ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో

మహేశ్వరం: పహాణీని ఆన్‌లైన్ చేసేం దుకు రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 3 వేలు తీసుకొని రెడ్ హ్యాండెడ్‌గా అధికారుల వలకు చిక్కాడు. ఈ సంఘటన మహేశ్వరం మండలంలోని గొల్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామానికి చెందిన దార లక్ష్మీనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగి స్తున్నాడు. ఆయనకు గ్రామ పరిధిలో సర్వేనంబర్ 21ఆ,ఇ లో 37 గుంటల భూమి ఉంది. సదరు భూమికి సంబంధించిన పహాణీని ఆన్‌లైన్  చేసేందుకు ఆయన ఆరు నెలలుగా అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ చుట్టూ తిరుగుతున్నాడు.

పని జరగాలంటే రూ. 5 వేలు ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ వీఆర్వో రైతుకు స్పష్టం చేశాడు. చేసేది లేక రైతు లక్ష్మీనారాయణ గతంలో రూ. 2 వేలు ఇచ్చాడు. మిగతా రూ.3 వేలు ఇస్తేనే పని అవుతుందని అసిస్టెంట్ వీఆర్వో చెప్పాడు. డబ్బుల విషయమై ఆయన నిత్యం రైతుకు ఫోన్ చేసి వేధించసాగాడు. నిరుపేద అయిన రైతుకు డబ్బు ఇచ్చే తాహతు లేదు. దీంతో డబ్బుల కోసం వేధిస్తున్న అసిస్టెంట్ వీఆర్వోను ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలని పథకం పన్నాడు. ఈవిషయమై లక్ష్మీనారాయణ రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించి వివరాలు చెప్పాడు. అధికారుల సూచన మేరకు రైతు బుధవారం ఉదయం 8 గంటలకు గొల్లూరులోని అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ ఇంటికి వెళ్లి రూ. 3 వేలు ఇచ్చాడు.
 
అధికారి డబ్బులు తీసుకొని కారులో వెళ్తుండగా ఏసీబీ అధికారులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అతడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని గ్రామంలోని ఆయన ఇంట్లో  సోదాలు చేశారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ వీఆర్వోను అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు సేకరించారు.  
 
భయంభయం..
గొల్లూరు గ్రామంలో అసిస్టెంట్ వీర్వో పాపయ్యగౌడ్ ఏసీబీకి పట్టుబడడంతో మండలంలోని అన్నిశాఖల అధికారుల కు గుబులు పట్టుకుంది. రోజంతా భయంభయంగా గడిపారు.  
 
పాపయ్యగౌడ్‌పై పలు అవినీతి ఆరోపణలు
అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అదే గ్రామానికి చెందిన  ఓ మహిళపై చేయి చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెవె న్యూ రికార్డులు, పహాణీల కోసం రైతులు వెళ్తే డబ్బులు తీసుకోనిదే పనిచేసేవాడు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో సీఐలు ఆర్. నిరంజన్, సుదర్శన్‌రెడ్డి,  సీఐ యేసుదాసు,  వైవీఎల్. నాయిడు, అంజిరెడ్డి ఉన్నారు.
 
నిత్యం వేధించేవాడు
'పహాణీ పత్రాన్ని ఆన్‌లైన్ చేసేందుకు అసిస్టెంట్ వీఆర్వో రూ. 5 వేలు డిమాండ్ చేశాడు. గతంలో రెండు వేలు ఇచ్చాను. మిగతా డబ్బులు ఇవ్వాలని రోజూ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఆయన వేధింపులు తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. మండలంలోని ఇంకా చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వారిని కూడా ఏసీబీకి పట్టిస్తాను.’
 -లక్ష్మీనారాయణ, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement