పులి‘చింతలు’... రెండింతలు! | Estimates of the growing power plant | Sakshi
Sakshi News home page

పులి‘చింతలు’... రెండింతలు!

Published Mon, Jun 1 2015 2:02 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM

పులి‘చింతలు’... రెండింతలు! - Sakshi

పులి‘చింతలు’... రెండింతలు!

పెరుగుతున్న విద్యుత్ కేంద్రం అంచనాలు
రూ.380 కోట్ల నుంచి రూ.563 కోట్లకు చేరిన వైనం
మూడింతలైన నిర్మాణ కాలవడ్డీ(ఐడీసీ)లు
రూ.38 కోట్ల నుంచి రూ.108 కోట్లకు పెంపు
నిర్మాణ గడువులు మరోసారి పెంపు     
సాక్షి, హైదరాబాద్: పులిచింతల జల విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతోంది.2006-07 నాటి సవివర పథక నివేదిక(డీపీఆర్) ప్రకారం రూ.380 కోట్లు ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తాజాగా...

రూ.563.50 కోట్ల కు ఎగబాకింది. అన్ని అనుమతులొచ్చినా అధికారుల నిర్లక్ష్యంతో, గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యే సరికి వ్యయం దాదాపు రెట్టింపై రూ.700 కోట్ల కు చేరే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.  నల్లగొండ జిల్లా వజినేపల్లి వద్ద కృష్ణా నదిపై 30.23 టీఎంసీల సామర్థ్యంతో పులిచిం తల డ్యాంతో పాటు 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ కేంద్రం పనులకు 2005లోనే కేంద్ర పర్యావరణ శాఖ , 2006లో కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)లనుంచి అనుమతులు వచ్చాయి. ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆధ్వర్యంలో 2007-14 మధ్య కాలంలో నత్తనడకన పనులు జరిగాయి. వరదలు, వర్షాల వల్ల ప్రాజెక్టు పరిసరాలు ముంపునకు గురవుతున్నాయంటూ నిర్మాణాన్ని ఏడాదిలో కొద్ది కాలమే చేపడుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జెన్‌కో సైతం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాడిలో పెట్టలేకపోయింది.
 
సవరించిన అంచనాలతో...
తాజాగా ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు.     విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పేరుతో రెండు రకాల పనులు చేయాల్సి  ఉంటుంది. ఈ పనుల వ్యయంతో పాటు పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లను కలిపి విద్యుత్ ప్రాజెక్టుల అంచనాలను రూపొందిస్తారు. పులిచింతల విద్యుత్ కేంద్రం తొలి అంచనాల్లో సైతం ఇదే తీరుతో వ్యవహరించారు. తాజాగా సవరించిన అంచనాల్లో తెలంగాణ జెన్‌కో ‘ప్రధాన కార్యాలయాల ఖర్చులు’ పేరుతో  కొత్త కేటగిరీని చేర్చింది.

జెన్‌కో ప్రధాన కార్యాలయం(విద్యుత్ సౌధ) నుంచి నిర్మాణ పనుల పర్యవేక్షణ, సిబ్బంది ఖర్చుల కోసం ఏకంగా రూ.49.59 కోట్లను కేటాయించింది. ఇతర కేటగిరీల అంచనా వ్యయాల్లో పెంపును పరిశీలిస్తే .. నిర్మాణ కాల వడ్డీ రూ.38 కోట్ల నుంచి రూ.105.49 కోట్లకు పెరిగి  మూడింతలైంది. ఈ ప్రాజెక్టు కోసం పొందిన రుణాలపై గత ఎనిమిదేళ్లకు సంబంధించిన 10.25 శాతం వడ్డీల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదిలో 219.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement