- కళాశాలలో ప్రవేశానికి అనుమతి ఇవ్వని సీసీఐఎం
- ఇప్పటికైనా మంత్రి, ఎంపీలు స్పందిస్తే ఫలితం
పోచమ్మమైదాన్ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు గడ్డు రోజులు ముంచుకొస్తున్నాయి. గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు అనుమతి నిరాకరించిన సీపీఐఎం అధికారులు గుడ్డిలో మెల్ల అన్నట్లుగా గత ఏడాది మాత్రం షరతులతో కూడిన అనుమతి(కండీషనల్ పర్మిషన్) ఇచ్చారు. అయితే, అప్పట్లో బృందం గుర్తించిన ఏ లోపాన్ని కూడా ఇప్పటి వరకు సరిచేయకపోవడంతో ఈసారి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వడం లేదని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) బృందం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యాలయానికి లేఖ సైతం పంపించింది. దీంతో జిల్లాలోని ఆయుర్వేద అభిమానులు, వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ రెండేళ్లు అనుమతి లేదు..
పురాతన వైద్యవిధానమైన ఆయుర్వేదాన్ని పరిరక్షించుకునేందుకు కొత్తగా ఆయుర్వేద వైద్య విద్య కళాశాలలు ఏర్పాటుచేయకున్నా ఉన్న వాటిని సంరక్షించుకోవడంపై కూడా పాలకులు శ్రద్ధ చూపడం లేదు. తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో మాత్రమే ఆయుర్వేద వైద్య కళాశాల ఉంది. 1956లో ఏర్పాటైన ఈ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో యాభై బీఏఎంఎస్ సీట్లు ఉన్నాయి. అనేక అసౌకర్యాలు రాజ్యమేలుతుండడంతో గతంలో రెండేళ్ల పాటు ప్రవేశాలకు అనుమతి లభించలేదు. అంటే వంద సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.
గత విద్యాసంవత్సరం మాత్రం జిల్లా ఎంపీల చొరవతో కండీషనల్ పర్మిషన్ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కొనని కారణంగా ఈ సంవత్సరం మళ్లీ మొండిచేయి ఎదురైంది. వరంగల్ కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్న సీపీఐఎం బృందం హైదరాబాద్‌లోని ఆయుర్వేద వైద్య కళాశాలకు అనుమతి ఇస్తూ హియరింగ్ కోసం జూలై 8వ తేదీన ఢిల్లీకి రావాలని సూచించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపించిన లేఖ వరంగల్‌లోని కళాశాల అనుబంధ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం అండడం లేదని, 100 బెడ్‌ల సామర్థమున్న ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేరని, కళాశాలకు బస్సు సౌకర్యం లేదనే తదితర సమస్యలను ప్రస్తావించినట్లు సమాచారం.
కేఎంసీ పరిస్థితే..
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలోని యాభై సీట్లకు ఈసారి ఎంసీఐ బృందం అనుమతి నిరాకరించిన విషయం విదితమే. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యులు సీట్లు తిరిగి సాధించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయుర్వేద వైద్య కళాశాలకు సంబంధించి పట్టిం చుకునే వారు కరువవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్యతో పాటు జిల్లా ఎంపీలు స్పందించి అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో ప్రవేశాలకు అనుమతి లభించేలా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.