రెండు రాష్ట్రాల్లోనూ సవాళ్లు ఎదుర్కొందాం..
ఏజీవర్సిటీ : ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టిసారించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.పద్మరాజు పిలుపునిచ్చారు. దేశ ఆహారభద్రత దృష్ట్యా రెండురాష్ట్రాల్లోని రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగించి ఇంకా పురోగతి సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ శాస్త్రవేత్తపై ఉందన్నారు. విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట స్వర్ణోత్సవాలు ప్రారంభించారు.
దీనికి విచ్చేసిన వీసీ పద్మరాజు మాట్లాడుతూ వ్యవసాయ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీ మరింత ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు,అధికారులు కృషిచేయాలని కోరారు. వర్సిటీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో సేవలందిస్తూ రైతునేస్తంగా వెలుగొందుతున్నారని ప్రశంసించారు. కాగా స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ ఏడాది జూన్ నుంచి జూన్ 2015వరకు స్వర్ణోత్సవ సంవత్సరంగా ప్రకటిస్తూ ప్రణాళికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు, టివికె సింగ్, రాజారెడ్డి, రాజిరెడ్డి, మీనాకుమారి, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల ఆందోళన :
స్వర్ణోత్సవాల్లో భాగంగా అధికారులు వర్సిటీ గేయాన్ని మైక్ ద్వారా వినిపించేందుకు యత్నించారు. అందులో ‘ఆంధ్రనాట వెలసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం’ అని ఉండడంతో తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గేయానికి బదులు తెలంగాణ రాష్ట్ర గేయమైన జయహే జయహే తెలంగాణ..పాటను పెట్టాలనడంతో అధికారులు దిగొచ్చి తెలంగాణ గేయాన్ని పెట్టడంతో ఆందోళన సద్దుమణిగింది.
సాదాసీదాగా స్వర్ణోత్సవాలు : ప్రపంచంలోనే వ్యవసాయవిద్యలో పేరెన్నికగల ఏజీ వర్సిటీ స్వర్ణోత్సవాలు సాదాసీదాగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. వర్సిటీ పరిధిలోని ఏ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి ఆడంబరం కనిపించలేదు. వర్సిటీ ప్రధానద్వారాల్లో కూడా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, వ్యవసాయ పరిశోధనా ఫలితాల వివరాలు తెలిపే సమాచారం కనిపించలేదు. రైతుసేవే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల్లో కనీసం ఒక్కరైతును కూడా ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.