దా‘రుణం’
⇒ అప్పుల బాధతో రైతన్న బలవన్మరణం
⇒ మూడు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు..
⇒ బావిలో అత్తెసరు నీటితో పంటలసాగు..
⇒ అవి ఎండిపోవడంతో మనోవేదన
⇒ అప్పులు తీరేమార్గం లేదని ఉరివేసుకొని ఆత్మహత్య
⇒ వికారాబాద్ మండలం కొటాలగూడ లాల్‌సింగ్ తండాలో ఘటన
వికారాబాద్ రూరల్: వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆయన అప్పులు చేసి మూడు బోర్లు తవ్వించినా చుక్కనీరు పడలేదు. ఓ బావి తవ్వించగా వచ్చిన అత్తెసరు నీటితో సాగుచేసిన పంటలు ఎండిపోయాయి.
చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి.. ఇక అప్పులు తీర్చేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ మండలం కొటాలగూడ అనుబంధ లాల్‌సింగ్ తండాలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రామవత్ తార్యా(35),చాందిబాయి దంపతులకు కుమారులు రమేష్, శంకర్, కూతుళ్లు లక్ష్మి, రోజాలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. కుమారులిద్దరు వికారాబాద్‌లో ఉంటున్నారు.పెద్ద కొడుకు పనిచేస్తుండగా చిన్న కొడుకు శంకర్ చదువుకుంటున్నాడు. తార్యా దంపతులు తమకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో అప్పు లు చేసి పొలంలో మూడు బోర్లు వేయించినా చుక్కనీరు కూడా పడలేదు.
దీంతో ఏడాది క్రితం అప్పు చేసి బావిని తవ్వించగా కొద్దిపాటి నీరు వచ్చింది. ఇటీవల రబీసీజన్‌లో సాగు చేసిన పూల తోట, వరిపంటకు సరిగా నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టా యి. తార్యా పెట్టుబడుల కోసం గొల్కోండ గ్రామీణ బ్యాంక్‌లో రూ. 80 వేలు తీసుకున్నాడు. బోర్లు, బావి తవ్వించేందుకు మొత్తం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంటలు ఎండుముఖం పట్టడంతో ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఆయన.. గురువారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చాందిబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
అప్పుల బాధతో వ్యవసాయకూలీ ఆత్మహత్య
పరిగి: అప్పుల బాధతో మనస్తాపం చెం దిన ఓ వ్యవసాయకూలీ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎదిరె సైదప్ప(48), భీమమ్మ దంపతులు తమకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మిగతా సమయంలో కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఏడాది క్రితం సైదప్ప అప్పు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. పరిగి ఏడీబీ బ్యాంకులో రూ.లక్ష అప్పు ఉండగా, కుటుంబ పోషణ ఇతర అవసరాలకు తెలిసిన వారి వద్ద మరో రూ. 3లక్షలు అప్పు చేశాడు.
అప్పులు తీర్చేమార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన బుధవారం పొలానికి వెళ్లాడు. సాయంత్రం గ్రామానికి చెందిన రైతు మోహన్‌రెడ్డి బావిలో దూకాడు. కొద్దిసేపటికి గమనించిన గ్రామస్తులు సైదప్పను బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుటుంబాన్ని బుధవారం రాత్రి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. గురువారం పరిగి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ కృష్ణ పేర్కొన్నారు.