
మారిషస్‌లో ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు
తెలుగు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ రాజీవ్ రాజా గౌరిస్సు వెల్లడి
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చే ఏడాది డిసెంబర్‌లో మారిషస్‌లోని పోర్టు లూరుుస్‌లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుగు కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ రాజీవ్ రాజా గౌరిస్సు తెలిపారు. ట్రస్టు ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షులు రాజాగౌరిస్సు మాట్లాడుతూ... మారిషస్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న మారిషస్ తెలుగు కల్చరల్ ట్రస్ట్ పోర్టులూయిస్‌లో 5వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించ తలపెట్టామని, అందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల సహాయ సహకారాలు కోరేందుకు వచ్చామని తెలిపారు.
ప్రపంచ తెలుగు మహా సభలకు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను అతిథులుగా ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ... మహాసభల నిర్వహణకు తెలుగు వర్సిటీ పూర్తి సహాయ సహకారాలను అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రతినిధి బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ ఆచార్య బృందావనం పార్థసారథి, ట్రస్టు బోర్డు సభ్యులు కృష్ణా రామస్వామి, రవి వెంకటస్వామి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి పాల్గొన్నారు.