భద్రాచలం : నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఆధిపత్య పోరు సాగుతోంది. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న వ్యక్తిని పట్టుమని నెల రోజులు కూడా ఆ సీట్లో కూర్చోనివ్వకుండా వైద్య విధానపరిషత్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పేదోలకు అందే వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. కారణాలేమైనా.. ఈ కుర్చీలాట ఆ శాఖలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా భద్రాచలం ఏరియా ఆస్పత్రి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ జిల్లా ఉన్నతాధికారులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లాలోని ఏజెన్సీకి కేంద్రంగా 100 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు.
ఇలా ప్రతి రోజూ 500 పైగా ఓపీ కేసులు, 150 మంది ఇన్‌పేషెంట్‌లుగా నమోదవుతున్నారు. సామర్థ్యం సరిపోకున్నా ఎక్కువగా వచ్చేది గిరిజనులే కావటంతో వారి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అవకాశం ఉన్నంత మేర వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి తగిన నమ్మకం కలిగిస్తుండటంతో ప్రసవాల కోసం గర్భిణులు ఎక్కువగానే వస్తున్నారు. ఇలా సెప్టెంబర్‌లో 358 ప్రసవాలు అయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 100 పడకల సామర్థ్యం గల ఆస్పత్రులలో అత్యధిక రికార్డుగా నమోదైంది.
దీన్ని సాధించటంలో కీలక పాత్ర వహించిన ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, ఇందుకు సహకరించిన వైద్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. తాజాగా సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి, డాక్టర్ దేవరాజ్‌కు అప్పగించినట్లు తెలిసింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందుకున్న డాక్టర్ దేవరాజ్, ఆ సీట్లో కూర్చునేందుకు ముందుగా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారిణి డాక్టర్ ఆనంద్‌వాణిని కలిసి, ఉత్తర్వుల ప్రతులను అందజేశారని సమాచారం.
మూణ్నాళ్లకే మార్పులు..
ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ జయరామిరెడ్డి ఏకంగా ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆయన వ్యక్తిగత పనులతో ఆ పోస్టులో పనిచేయలేనని చెప్పి తప్పుకున్నారు. దీంతో అప్పటి కలెక్టర్ సిద్దార్థజైన్, ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్ డాక్టర్ కోటిరెడ్డికి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆయన సంవత్సరం ఏడు నెలల పాటు ఆ సీట్లో కూర్చున్నారు. అయితే కోటిరెడ్డి జూనియర్ అనే పేరుతో ఆయన కంటే సీనియర్ వైద్యులైన విజయారావుకు వైద్య విధాన పరిషత్ శాఖ ఉన్నతాధికారులు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. కానీ విజయారావు ఆసుపత్రిపై సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఓ శిశు మరణంలో కూడా ఆయన పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి, విజయారావును కొత్తగూడెం ఆస్పత్రికి బదిలీ చేశారు.
తొమ్మిది నెలల్లో ముగ్గురు...
భద్రాద్రి ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విజయారావు 8 నెలలు పనిచేశారు. ఆయనను కొత్తగూడెం బదిలీ చేసిన తర్వాత అదనపు డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ పుల్లయ్యకు ఇంచార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆయన అనేక హోదాలను నిర్వహిస్తుండటం, వైద్య విధాన పరిషత్‌కు సంబంధం లేని వ్యక్తి కావటంతో సరిగ్గా 8 రోజులకే ఆయన స్థానంలో సెప్టెంబర్ 6న కోటిరెడ్డిని సూపరింటెండెంట్ నియమించారు. సరిగ్గా నెల రోజులకే మళ్లీ ఆయనను త ప్పిస్తూ, ఆ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదం ప్రస్తుతం కలెక్టర్ వద్దకు చేరటంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే అందరి దృష్టి ఉంది. కాగా, కోటిరెడ్డిని మరికొంత కాలం పాటు కొనసాగించేందుకే కలెక్టర్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
నిధుల లే మి ఉన్నా...
ఏరియా ఆసుపత్రికి గత కొంతకాలంలో అభివృద్ధి(హెచ్‌డీఎస్) నిధులు రావటం లేదు. కానీ ఆసుపత్రిలో గతంలో కంటే ఆరోగ్య శ్రీ పథ కం కింద ఎక్కువగా ఆపరేషన్‌లు చేస్తుండటంతో, అందులో వస్తున్న నిధులను అత్యవసర పనులకు ఉపయోగిస్తున్నారు. ఇది గమనించిన ఐటీడీఏ పీవో దివ్య మౌలిక వసతుల కోసం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. అంతే కాకుండా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కలెక్టర్ ఇలంబరితి సహకారంతో తగిన చ ర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణ గాడిలో పడుతున్న సమయంలో మళ్లీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని మార్పు చేస్తుండటం గమనార్హం.
వైద్య సేవలపై ప్రభావం..
ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలుగకుండా కోటిరెడ్డి తనదైన శైలిలో వైద్య సేవలు అందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవోతో పాటు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆనందవాణి ప్రోత్సాహం కూడా అందుతుండటంతో వైద్యులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రోగులకు ఆటంకం లేకుండా సేవలందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏరియా ఆసుపత్రిలో సాగుతున్న కుర్చీలాట నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది ఇరు వర్గాలుగా విడిపోయారు. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రిలోని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. దీని ప్రభావం రోగులపై పడుతుందని గిరిజన సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ నిర్ణయం మేరకే చర్యలు...
- డాక్టర్ ఆనందవాణి, డీసీహెచ్‌ఎస్
సూపరింటెండెంట్‌గా డాక్టర్ దేవరాజ్‌ను నియమిస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందిన మాట వాస్తవమే. ఈ మేరకు తగు చర్య నిమిత్తం కలెక్టర్ దృష్టికి తెసుకెళ్లాము. ఆయన నిర్ణయం ప్రకారమే తదుపరి చర్యలు తీసుకుంటాము.
కుర్చీలాట..!
Published Sun, Oct 5 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement