
‘పొన్నం’ వర్సెస్ ‘రసమయి’
కరీంనగర్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రస మయి బాలకిషన్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల వారు నినాదాలు, ప్రతినినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కరీంనగర్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఆర్‌అండ్ బీ అతిథిగృహంలో సేద తీరారు. ప్రభాకర్ కాంగ్రెస్ నేతలతో కలసి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లారు. పొన్నం తన బృందంతో మంత్రి లక్ష్మా రెడ్డి వద్దకు వచ్చి తమకు సమయం ఇవ్వాలని కోరారు.
మెడికల్ కళాశాల మంజూరు ఆలస్యంపై ప్రశ్నిస్తూ నాటి పత్రిక ప్రకటనలు, సీఎం మాట్లాడిన వీడియో క్లిప్పిం గ్‌లను సెల్‌ఫోన్ ద్వారా మంత్రికి చూపిస్తుండగా.. రస మయి జోక్యం చేసుకొని ‘చూపెట్టింది చాలులే.. ఇన్నాళ్లు మీరేం చేశారంటూ..’ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. మంత్రి ఇరువురిని సముదాయిం చారు. రసమయిని పక్కకు తీసుకెళ్లడంతో ఆందోళన సద్దుమణిగింది.