ముట్రాజ్‌పల్లిలో అతిసార
గజ్వేల్: గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి గ్రామంలో అతిసార ప్రబలింది. తాగునీరు కలుషితం కావడంతో గ్రామస్తులు రెండురోజులుగా వాంతులు, విరేచనాల తో బాధపడుతున్నారు. బుధవారం పరిస్థితి తీవ్రం కావడం తో 18 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని ఇళ్లవద్ద ఉన్న నల్లాలను ఓపెన్ చేసి వదిలివేయడంతో నీళ్లు గుంతల్లో నిండిపోయి తిరిగి పైప్‌లైన్‌లలోకి చేరాయి. దీంతో ఆ నీటిని తాగిన ప్రజలు అస్వస్థతకు గురయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
అస్వస్థతకు గురైన వారిలో సమ్రీన్, రిజ్వానా, రుబినా ఫాతిమ, కనకరాజు, షాహిన్‌బేగం, గౌస్‌ఖాన్, మల్లమ్మ, పోచమ్మ, జహంగీర్‌తోపాటు మరో ముగ్గు రి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబీకులు వారిని గజ్వేల్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గంటగంటకూ రోగుల సంఖ్య పెరుగుతున్న కారణంగా పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న జిల్లా మలేరియా నివారణ అధికారి నాగయ్య హుటాహుటీన ముట్రాజ్‌పల్లికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అతిసార ఉధృతంగా ప్రబలడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాపించినట్లు బయటపడిందన్నారు. ప్రతి ఒక్కరు కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని, అప్పుడు అతిసార బారిన పడకుండా ఉంటారన్నారు. మరోవైపు గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కమిషనర్ సంతోష్‌కుమార్‌లు కూడా బుధవారం రాత్రి ముట్రాజ్‌పల్లిని సందర్శించి అతిసార అదుపునకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు.
పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించినా...
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అధికారులు ఆర్భాటంగా పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా... అతిసారం కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి ముట్రాజ్‌పల్లిలో ఒకేసారి 18 మంది అస్వస్థతకు గురికావడం కలవరం సృష్టిస్తోంది. సంపూర్ణ పారిశుద్ధ్య సాధనలో భాగంగా నల్లా గుంతలను పూడ్చి వేయాల్సి ఉండగా, అధికారులు ముట్రాజ్‌పల్లిలో ఆ ప్రక్రియను మరిచిపోవడం కారణంగా నీరు కలుషితమై అతిసార ప్రబలినట్లు తెలుస్తోంది. అతిసార ప్రబలిన తర్వాత బుధవారం ఆగమేఘాల మీద నల్లా గుంతల పూడ్చివేత, దుర్గంధ భరితంగా ఉన్న వీధుల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.
పరిస్థితి అదుపులోనే ఉంది
ముట్రాజ్‌పల్లిలో అతిసార ప్రబలడంతో బుధవారం రాత్రి జిల్లా వైద్యాధికారిణి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అతిసార నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతిసార బాధితులకు పూర్తి స్వస్థత చేకూరే వరకు శిబిరం కొనసాగిస్తామన్నారు.
అతిసార ఘటనపై కలెక్టర్ ఆరా
గజ్వేల్ అర్బన్: ముట్రాజుపల్లిలో ప్రబలిన అతిసార అదుపులోకి వచ్చేంత వరకూ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఆదేశించారు. ముట్రాజ్‌పల్లిలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్యాధికారి, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్‌తో శరత్ సమీక్షించారు. గ్రామంలోని నల్లాల పైపుల లీకేజీలను అరికట్టడంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలన్నారు. గ్రామానికి వెంటనే వెళ్లి పరిస్థితిని సమీక్షించడంతో పాటు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని వైద్యాధికారి పద్మను ఆదేశించారు.