విషజ్వరాలతో మంథని మండలం గుంజపడుగు గ్రామం గజగజ వణుకుతోంది. ఈ గ్రామంలో 12 రోజుల వ్యవధిలో నలుగురు జ్వరాలతో మృత్యువాతపడ్డారు. పారిశుధ్య లోపం, తాగునీరు కలుషితం కావడంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పట్టింపులేని తనం కూడా ఇక్కడి ప్రజలకు శాపంగా మారుతోంది. ఊరుఊరంతా జ్వరాలతో బాధపడుతున్నా.. కనీసం వైద్యశిబిరం ఏర్పాటు చేయలేదంటే వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
మంథనిరూరల్ : గుంజపడుగు గ్రామాన్ని జ్వరాలు ఏటా వెంటాడుతూనే ఉన్నాయి. మూడేళ్ల క్రితం వర కు ఇక్కడ జ్వరాలు వచ్చాయంటే పదుల సంఖ్యలో చనిపోయేవారు. మేజర్ గ్రామ పంచాయతీ స్థాయిలో జనాభా ఉన్నా.. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో పదిహేను రోజులుగా గ్రామాన్ని విషజ్వరాలు చుట్టుముట్టాయి. గ్రామానికి చెందిన సాదుల నర్సమ్మ, సాదుల భూదమ్మ, ఆకుల మల్లయ్య, తాజాగా శనివారం పెయ్యల బానయ్య విషజ్వరంతో చనిపోయారు. ఇంటికొకరు చొప్పున మంచం పట్టారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తుండగా.. పేదలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. మూడు నాలుగు రోజులు చికిత్స పొందాక ఇంటికొచ్చినా.. మరుసటి రోజే మళ్లీ జ్వరం బారినపడుతున్నారు.
ఎవరిని కదిలించినా జ్వరమే..
గ్రామానికి చెందిన సుంకరి కిష్టయ్య, బొల్లి ఓదెలు, ఆకుల లక్ష్మి, మధునమ్మ, బానేష్, సతీష్, వీరవేన శ్రీనివాస్, హర్షవర్ధన్, గట్టమ్మ .. ఇలా ఇంటికి ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరం రాగానే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. అప్పటికీ తగ్గకుంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.
మూడేళ్ల క్రితం వరుస మరణాలు..
మూడేళ్ల క్రితం వరకు గ్రామంలో ఏటా విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ప్రజలు అనారోగ్యాల పాలైనా కనీసం వైద్య సహాయం అందేది కాదు. ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఉన్నా సేవలు అంతంతమాత్రంగానే అందేవి. ప్రజల ఇబ్బం దులు, ఇక్కడి పరిస్థితులపై పత్రికల్లో వచ్చిన కథనాలపై అప్పటి జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ స్పందించారు. గ్రామంలో మెగాహెల్త్ క్యాంపు ఏర్పాటు చేయించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి ఓ వైద్యుడిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆమె వెళ్లిపోవడంతో ఆ కేంద్రానికి ప్రస్తుతం ఏఎన్‌ఎంలే దిక్కయ్యారు.
పారిశుధ్య లోపం.. కలుషిత నీరు..
గ్రామంలో విషజ్వరాల విజృంభనపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు పారిశుధ్యం లోపించింది. పారిశుధ్య చర్యలు చేపడుతున్నామని, తాగునీరు క్లోరినేషన్ చేయిస్తున్నామని పంచాయతీ అధికారులు చెబుతున్నా.. అవి ఎక్కడా కనిపించడం లేదు. కలుషిత నీరు తాగుతున్న ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నా రు. వైద్య సిబ్బంది కన్నెత్తి చూడటం లేదని, కనీసం గోలీలు ఇచ్చేవారు కరువయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు.వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ప్రాణాలు పోతున్నాయ్
Published Sun, Sep 7 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement