గండిపేట్ చెరువు
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ బిర్యానీ.. గండిపేట్ పానీ ప్రపంచ ప్రసిద్ధి. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న గండిపేట్ (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ నీటిని మినరల్ వాటర్ తరహాలో శుద్ధి చేసి రుచిని పెంచేందుకు జలమండలి కొత్త టెక్నాలజీని వినియోగించనుంది. రెండు మొబైల్ మాడ్యులర్ నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ జలాశయాల రా వాటర్‌ను మినరల్ వాటర్ వలే శుద్ధి చేసి రోజూ సుమారు 52 మిలియన్ గ్యాలన్ల జలాలను గ్రేటర్ ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వెల్లడించారు.
సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, పదిహేను రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జంట జలాశయాల్లో 5 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో మహా నగరానికి ఈ వేసవిలో పానీపరేషాన్ ఉండదని స్పష్టం చేశారు. మహానగరంలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. గ్రేటర్‌లో ఇటీవలి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడం, వేసవితాపం పెరగడంతో ట్యాంకర్ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరుగాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి వారంలో ఏడురోజులూ రోజూ 24 గంటల పాటు కేంద్రాలు పనిచేసేలా ఫిల్లింగ్ కేంద్రాల్లో తాగునీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నీటిని ట్యాంకర్లలో నింపడం ద్వారా కొరత ఉన్న ప్రాంతాలకు తక్షణం సరఫరా చేస్తామన్నారు. బస్తీలకు ఉచితంగా నీటిని సరఫరా చేసే 600 ట్యాంకర్లు దారితప్పకుండా వాటిపై నిరంతరాయంగా నిఘా పెడతామన్నారు. ఇక ట్యాంకర్ బుకింగ్ చేసుకునేవారికి ఆలస్యం లేకుండా చూసేందుకు ప్రస్తుతం ఉన్న 525 ట్యాంకర్ల సంఖ్యకు అదనంగా మరో వంద వాహనాలను పెంచనున్నట్లు తెలిపారు.
బీరు కంపెనీలకు బంద్..పేదలకే తాగునీరు
వేసవి నేపథ్యంలో నగరానికి వివిధ జలాశయాల నుంచి జరిగే నీటి సరఫరాలో 5 మిలియన్ గ్యాలన్ల నీటికి కోత పడనుంది. దీంతో బీరు కంపెనీలకు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. పేదలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నిత్యం 418 మిలియన్ గ్యాలన్ల నీటిని 9.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి సరఫరా జరిగే 57 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా నిలిచిపోవడంతో జంట జలాశయాల నుంచి రోజూ 52 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్న విషయం విదితమే. దీంతో నగరానికి రోజువారీగా సరఫరా అయ్యే నీటికి కోత పడిన నేపథ్యంలో కొన్ని బ్రూవరేజెస్ సంస్థలకు నీటి సరఫరా నిలిపివేశామన్నారు.
20 అదనపు ఫిల్లింగ్ కేంద్రాలు..
ప్రస్తుతం రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ట్యాంకర్ల నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతాల్లో కొత్తగా 20 ఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎండీ తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో 50 అదనపు ట్యాంకర్లు రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరాకు మరో 50 ట్యాంకర్లను అదనంగా ఏర్పాటుచేసి ఈ వేసవిలో దాహార్తిని తీరుస్తామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న గ్రామాల్లో 165 మంచినీటి ట్యాంకుల నిర్మాణం పనుల్లో ఇప్పటికే వంద ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఈ ట్యాంకుల వద్ద కూడా ప్రైవేటు నీటి ట్యాంకర్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తామన్నారు. దీంతో ప్రైవేటు ట్యాం కర్ల ఆగడాలకు చెక్ పెడతామన్నారు. త్వరలో నూతన ట్యాంకర్ల పాలసీని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ప్రైవేటు ట్యాంకర్ యజమానులను కూడా ఈ పాలసీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. గృహ వినియోగదారులు(డొమెస్టిక్) ఐదువేల లీటర్ల నీటిని సరఫరా చేసే ట్యాంకర్‌కు రూ.500, పదివేల లీటర్ల నీటిని సరఫరా చేసే ట్యాంకర్‌కు రూ.1000 మాత్రమే వసూలు చేయాలని, అదనంగా వసూలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక శేరిలింగంపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రస్తుతం ఘన్‌పూర్–పటాన్‌చెరు(43 కి.మీ) మధ్య ఉన్న గోదావరి రింగ్ మెయిన్–3 పైపులైన్‌ను మరో 8 కిలోమీటర్లు (ముత్తంగి వరకు) పొడిగించేందుకు ప్రతిపాదనలను సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించామని ఎండీ తెలిపారు.
వేసవి కార్యాచరణకు ప్రత్యేకాధికారులు
నగర వ్యాప్తంగా ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, నీటి సరఫరా వేళలను తనిఖీ చేసేందుకు 10 మంది చీఫ్ జనరల్ మేనేజర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆయా డివిజన్ల పరిధిలో పర్యటిస్తారు. డివిజన్ స్థాయిలో అరకొర నీటి సరఫరా, బూస్టర్ పంపులు, అదనపు వాల్వ్‌ల ఏర్పాటు, కలుషిత జలాల నివారణ, తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా తదితర సమస్యలను పరిష్కరించేందుకు ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిర్వహణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment