ఆరు గంటల్లో ఫినిష్! | general elections counting finish with in 6 hours | Sakshi
Sakshi News home page

ఆరు గంటల్లో ఫినిష్!

Published Fri, May 16 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

general elections counting finish with in 6 hours

కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రంగా అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు విడివిడిగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు.శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మొదటి అరగంటలో తొలి రౌండు ఫలితాలు వెలువడుతాయి. ఆరు గంటల వ్యవధిలో తుదిఫలితాలు తేలిపోతాయి.

 ఈవీ ఎంలు కావడంతో ఓట్ల లెక్కింపు సునాయాసంగా జరుగుతుంది. మీటనొక్కితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. ఓట్ల లెక్కింపు కోసం 1,378 మంది సిబ్బందిని నియమించిం ది. 1,144 మంది విధుల్లో పాల్గొంటుండగా.. అత్యవసర నిమిత్తం 234 మందిని రిజర్వులో ఉంచింది. 442 మంది సూపర్‌వైజర్లు, 468 మంది అసిస్టెంట్లు, 468 మంది మైక్రోఅబ్జర్వర్లు ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు.

 లెక్కింపు ఇలా..
 ఉదయం 8గంటల లోపు స్ట్రాంగ్ రూంల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్లను(ఈవీఎం) కౌంటింగ్ హాళ్లకు తీసుకువస్తారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా తెస్తారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు. ప్రతి రౌండ్ ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో డిస్‌ప్లే చేస్తారు. కంట్రోల్ యూనిట్‌లో ఫలితాల ప్రదర్శనకు ప్రింటింగ్ కమ్ ఆక్సిలరీ యూనిట్(పీఏడీయూ) వినియోగిస్తున్నారు. టేబుల్‌కు ఒకటి చొప్పున 510 పాడు యూనిట్లు  ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మొత్తం వీడియో చిత్రీకరిస్తారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. వీటి లెక్కింపునకు ఆరు టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్ వద్ద సూపర్‌వైజర్, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు ఉంటారు.

 అనంతరం కంట్రోల్ యూనిట్లను ఆయా కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లపై ఉంచి లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ ప్రక్రియతో తొలిరౌండ్ పూర్తవుతుంది.

 అలా ఒక్కో నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన టేబుళ్లను బట్టి కంట్రోల్ యూనిట్లు(ఈవీఎం)ను తెరిచి ఓట్లు లెక్కిస్తారు. ఇలా చివరి వరకు ప్రక్రియ సాగుతుంది.

 ఆఖరి రౌండు తరువాత ఏజెంట్ల సంతకాలు తీసుకుని తుది ఫలితాలు రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు.

 బ్యాలెట్‌లో అభ్యర్థులకు కేటాయించిన సంఖ్య ఆధారంగా వారికి వచ్చిన ఓట్లను గుర్తిస్తారు. ఇలా అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తి చేస్తారు.
 
 ముందుగా వేములవాడ.. చివరగా కరీంనగర్
 ఒక్కో నియోజకవర్గానికి రెండు హాళ్లు, హాల్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు టేబుళ్లలో ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు, మరో ఏడు టేబుళ్లలో ఎంపీ ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఒక్కో రౌండ్‌కు 13వేల నుంచి 14వేల ఓట్లు ఉంటాయి. అత్యధిక పోలింగ్ కేంద్రాలున్న చోట ఎక్కువ సమయం పడుతుంది. కరీంనగర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 346పోలింగ్ కేంద్రాలున్నాయి. 14 టేబుళ్లలో 25రౌండ్లలో ఈ ఓట్లను లెక్కించే అవకాశమున్నందున మధ్యాహ్నం 2గంటల వరకు తుది ఫలితం వెల్లడవుతుంది.

 వేములవాడ నియోజకవర్గంలో అతి తక్కువగా 223 పోలింగ్ కేంద్రాలున్నాయి. 16 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుండటంతో మధ్యాహ్నం 12గంటలకల్లా ఫలితం తేలిపోతుంది. కోరుట్ల 19 రౌండ్లు, జగిత్యాల 17, ధర్మపురి 18, రామగుండం 19, మంథని 20, పెద్దపల్లి 19, కరీంనగర్ 25, చొప్పదండి 19, వేములవాడ 16, సిరిసిల్ల 18, మానకొండూర్ 18, హుజూరాబాద్ 20, హుస్నాబాద్ 21 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి.
 
 విజయోత్సవాలు 17న..
 16న ఎన్నికల విజయోత్సవాలపై ఈసీ నిషేధం విధించింది. 17న పోలీసుల అనుమతితో విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 15 సాయంత్రం 5గంటల నుంచి 16న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను నిషేధించింది.
 
 ఇవి నిషిద్ధం..
 కౌంటింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారిపై ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగిని ఏజెంట్ నియమించకూడదు.

 సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పెన్నులు, పెన్సిళ్లు, పేపర్లు కౌంటింగ్ హాల్లోకి అనుమతించరు.

 ఏజెంట్లకు పేపర్, పెన్ను అక్కడే అందిస్తారు.

కౌంటింగ్ ఏజెంట్లను వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోనిస్తారు.

 ఉదయం 7గంటలకు ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి.

 కౌంటింగ్ కేంద్రాలివే..
 ఎస్సారార్ కళాశాల : కరీంనగర్ పార్లమెంట్, కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల వారీగా 14కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు.

 అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల:  పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పెద్దపెల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎల్‌ఎండీ సమీపంలోని పాలిటెక్నిక్‌లో నిర్వహిస్తారు. ఇక్కడ 8కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు.

 సెయింట్ అల్ఫోన్స్ స్కూల్: నిజామాబాద్ ఎంపీ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సెయింట్ అల్ఫోన్స్ స్కూల్‌లో జరుగుతుంది. వీటికోసం 4 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు.

Advertisement

పోల్

Advertisement