సర్వసభ్య సమావేశం వద్దు | General Meeting is postponed for bar council | Sakshi
Sakshi News home page

సర్వసభ్య సమావేశం వద్దు

Published Sat, Nov 29 2014 3:55 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సర్వసభ్య సమావేశం వద్దు - Sakshi

సర్వసభ్య సమావేశం వద్దు

బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం    
మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా  

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక బార్‌కౌన్సిల్ ఏర్పాటుకోసం నిర్వహించ తలపెట్టిన సర్వసభ్యసమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే విషయంలో వెంటనే తగిన చర్యలు ప్రారంభించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శనివారం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిని వాయిదా వేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పును నిలుపు చేయాలా? వద్దా..? అన్న విషయంపై విచారణ జరుగుతున్న సమయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.
 
 ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు నిమిత్తం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. బీసీఐ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, రిట్ పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.ఆర్.అశోక్, సరసాని సత్యంరెడ్డిలు తమ వాదనలను వినిపించారు.
 
  చట్ట సభల ద్వారా న్యాయవాదుల చట్టానికి సవరణలు చేసి, అందులో తెలంగాణ రాష్ట్రం పేరును చేర్చేంత వరకు ప్రస్తుతం ఉన్న బార్ కౌన్సిలే ఇరు రాష్ట్రాలకూ కొనసాగుతుందని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచే తెలంగాణకు బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని అశోక్, సత్యంరెడ్డిలు వివరించారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌నే ఇరు రాష్ట్రాలకూ యథాతథంగా కొనసాగిస్తే, అది పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందన్నారు. ఈ సమయంలో ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుని సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసే విషయంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, వచ్చేవారం నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement