'బంగారు తెలంగాణ నినాదం..ఒట్టి బూటకం' | golden telangana slogan is trash | Sakshi
Sakshi News home page

'బంగారు తెలంగాణ నినాదం..ఒట్టి బూటకం'

Published Sun, Jan 11 2015 8:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

golden telangana slogan is trash

కొమరారం (ఇల్లెందు): బంగారు తెలంగాణ నినాదం ఒట్టి బూటకమని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య విమర్శించారు. ‘అటవీశాఖ దౌర్జన్యాలు’ అనే అంశంపై న్యూడెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కొమరారం గ్రామంలో సదస్సుకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘బంగారు తెలంగాణ రావాలంటే ముందుగా సాధించాల్సింది నూటికి 70 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాభివృద్ధని, ఆకాశ హర్మ్యాలు కాదు’’ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో తమ బతుకులు మారతాయన్న కోట్లమంది ప్రజల ఆశలు.. కేసీఆర్ పాలనలో అడియాశలవుతున్నాయని అన్నారు. అటవీశాఖ అధికారులు సర్వేల పేరుతో ప్రజల అధీనంలోని భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారి పనితీరుని తప్పుబట్టారు.
 
 దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం... గిరిజనుల అధీనంలోగల భూములకు పట్టాలు ఇవ్వకుండా లాక్కుంటోందని విమర్శించారు. ‘పర్యావరణం పేరిట.. పేదలు ఆక్రమించుకున్న భూములను లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. రాచకొండ గుట్టల్లోని 11వేల ఎకరాలను ఫిల్మ్ సిటీ, ఫార్మా రంగానికి పర్యావరణం దెబ్బతినదా..?’ అని ప్రశ్నించారు. ‘ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు పోడు భూముల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కోరం కనకయ్య.. ప్రభుత్వం వైపు ఉంటాడో, ప్రజల వైపు ఉంటాడో తేల్చుకోవాలి’ అని సూచించారు.
 
 న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ.. రైతాంగ ఆత్మహత్యల నివారణపై సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. పేదలకు రెండు పడక గదులతో ఇళ్ల నిర్మాణం హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘‘ఈ పథకానికి బడ్జెట్‌లో కేవలం వెయ్యి కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. గతంలో కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లింపులకు కూడా ఇవి సరిపోవు’’ అని చెప్పారు. రజాకార్లను పెంచి పోషించిన నిజాం నవాబును సీఎం కీర్తించడం మన దౌర్భాగ్యమన్నారు. ఈ సదస్సుకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ జరిగింది. అరుణోదయ జిల్లా కార్యదర్శి అజ్మీరా బిచ్చా ఆధ్వర్యంలో ‘ఆటా-పాటా’ ఉర్రూలూతలూగించింది. సదస్సులో పార్టీ జిల్లా నాయకులు జగ్గన్న, ఎన్.రాజు, తుపాకుల నాగేశ్వరరావు, ఆవుల కిరణ్, గండి యాదగిరి, వై.ప్రకాశ్, అజయ్, కోండ్రు భద్రయ్య, బొగ్గారపు వెంకన్న,  రేసు బోసు, ముక్తి సత్యం, ఎంపీపీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement