సాక్షి, హైదరాబాద్: సబ్సిడీపై అందించే పాడి పశువులను ఎక్కడైనా, ఎవరి వద్దయినా కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారు ఏ రకమైన పాడి పశువునైనా కొనుగోలు చేసుకోవచ్చని.. దీనిలో సంబంధిత శాఖ, వ్యక్తుల జోక్యం ఉండదని పేర్కొంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేశారు.
తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ–రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లోని 2.13 లక్షల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి పశువును సబ్సిడీపై అందజేయనున్నారు. ఒక్కో పాడి పశువుకు రూ. 80 వేలు యూనిట్ ధరగా నిర్ధారించారు. అందుకు అదనంగా రూ.5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75% (రూ.60వేలు), ఇతరులకు 50%(రూ.40వేలు) సబ్సిడీ ఖరారు చేశా రు.
మిగిలిన సొమ్మును లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయనున్నారు. పశువులను కొనుగోలు చేసిన చోటు నుంచి రైతు వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. పథకానికి కావాల్సిన నిధులను విజయ డెయిరీ ఫెడరేషన్ ద్వారా సమకూర్చుతారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పాడి పశువుల కొనుగోలు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment