సీఎంఆర్ బకాయిలపై సర్కార్ దృష్టి
వంద శాతం బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తేస్తాం: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల వసూలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలవారీగా ఎగవేతదారుల జాబితాను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2010-11 నుంచి 2014-15 వరకు 115 మంది మిల్లర్ల నుంచి రూ.134 కోట్ల విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. బుధవారం ఇక్కడ పౌరసరఫరాల శాఖ భవన్‌లో సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్లతో కమిషనర్ సమావేశమయ్యారు. రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపారు. ఎగవేతదారుల వివరాలను వారికి అందించి, పలు ప్రతిపాదనలను మిల్లర్ల ముందుంచారు.
దీనిపై సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ 30వ తేదీలోగా సీఎంఆర్ బకాయిలు మొత్తం చెల్లిస్తే కేసులు ఎత్తివేసి, సీజ్ అయిన వాటిని తెరిపించి, మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామని ఆనంద్ చెప్పారు. 75% బకాయిలు చెల్లిస్తే మాత్రం సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయిస్తామని, మిగిలిన 25% జన వరి 31లోగా చెల్లించాలని సూచించారు. 50% అప్పగించినవారు మిగి లిన 50% మార్చి 31లోగా అప్పగించాలన్నారు. వంద టన్నుల కంటే తక్కువగా సీఎం ఆర్ అప్పగించే మిల్లులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. సీఎంఆర్ అప్పగించలేనివారు మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో కూడా చెల్లించవచ్చన్నారు. పాత బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.