Debt Collection
-
‘సులభతర వాణిజ్యం’ అమలులో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈఓడీబీ)లో సంస్కరణలను సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు వీలుగా అనుమతి ఇచ్చినట్టు తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు సంస్కరణ అమలు చేసి ఆ మేరకు రుణ సేకరణ పరిమితి పెంచుకున్న ఏపీ తాజాగా సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచి మరింత రుణ సేకరణకు అర్హత పొందింది. (లక్షకు చేరువలో మరణాలు) ఈ మేరకు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.25% అదనపు రుణం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లయింది. దీంతో బహిరంగ మార్కెట్ ద్వారా రూ.2,525 కోట్ల మేర అదనంగా రుణం తెచ్చుకునేందుకు అర్హత పొందింది. జిల్లా స్థాయిలో అనుమతులు మంజూరు చేసే 40 సంస్కరణలతోపాటు ఆన్లైన్ ద్వారా కేంద్రీకృత ఇన్స్పెక్షన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లుగా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్ధారించడంతో కేంద్రం ఈ సదుపాయాన్ని కల్పించింది. -
రుణ మొత్తంలో వసూలు 2 శాతమే!
మాల్యాపై రాజ్యసభలో మంత్రి గంగ్వార్ న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారు, పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా 2016 డిసెంబర్ 31వ తేదీ నాటికి దాదాపు రూ.8,191 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకింగ్ కేవలం అందులో 2 శాతం అంటే రూ.155 కోట్లు మాత్రమే వసూలు చేసుకోగలిగిందని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. జప్తులో ఉన్న కొన్ని ఆస్తుల ఆన్లైన్ మోగా వేలం ద్వారా ఈ మొత్తాలను బ్యాంకులు వసూలు చేసుకోగలిగినట్లు గంగ్వార్ తెలిపారు. మిగిలిన మొత్తాల వసూళ్లకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
‘పాన్‌కార్డ్ క్లబ్స్’ సంస్థ ఖాతాల జప్తు
రూ.7,035 కోట్ల బకాయిల వసూలుకు సెబీ చర్యలు న్యూఢిల్లీ: అక్రమంగా నిధులు సమీకరించిన కేసులో పాన్‌కార్డ్ క్లబ్స్ లిమిటెడ్‌తోపాటు, ఆ సంస్థ డెరైక్టర్లపై సెబీ చర్యలు ప్రారంభించింది. రూ.7,035 కోట్ల బకారుుల వసూలుకు గాను కంపెనీతోపాటు, ఆరుగురు డెరైక్టర్లకు చెందిన బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు ఆదేశించింది. పాన్‌కార్డు క్లబ్స్‌కు బకారుు పడిన 10 అనుబంధ కంపెనీల బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల అటాచ్‌మెంట్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాల (సీఐఎస్) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ.7,000 కోట్లను తిరిగి చెల్లించాలని పాన్‌కార్డు క్లబ్స్‌ను సెబీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించింది. అసలుతో పాటు, వడ్డీ, ఇతర చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంది. అరుుతే, ఈ ఆదేశాల అమలులో విఫలం కావడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. -
సీఎంఆర్ బకాయిలపై సర్కార్ దృష్టి
వంద శాతం బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తేస్తాం: సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల వసూలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలవారీగా ఎగవేతదారుల జాబితాను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2010-11 నుంచి 2014-15 వరకు 115 మంది మిల్లర్ల నుంచి రూ.134 కోట్ల విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. బుధవారం ఇక్కడ పౌరసరఫరాల శాఖ భవన్లో సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్లతో కమిషనర్ సమావేశమయ్యారు. రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపారు. ఎగవేతదారుల వివరాలను వారికి అందించి, పలు ప్రతిపాదనలను మిల్లర్ల ముందుంచారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ 30వ తేదీలోగా సీఎంఆర్ బకాయిలు మొత్తం చెల్లిస్తే కేసులు ఎత్తివేసి, సీజ్ అయిన వాటిని తెరిపించి, మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామని ఆనంద్ చెప్పారు. 75% బకాయిలు చెల్లిస్తే మాత్రం సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయిస్తామని, మిగిలిన 25% జన వరి 31లోగా చెల్లించాలని సూచించారు. 50% అప్పగించినవారు మిగి లిన 50% మార్చి 31లోగా అప్పగించాలన్నారు. వంద టన్నుల కంటే తక్కువగా సీఎం ఆర్ అప్పగించే మిల్లులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. సీఎంఆర్ అప్పగించలేనివారు మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో కూడా చెల్లించవచ్చన్నారు. పాత బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ముగిసిన నాట్కో ఫార్మా క్విప్ ఇష్యూ
రూ. 341 కోట్ల సమీకరణ ఇష్యూ ధర రూ. 2,130 త్వరలో షేర్ల విభజన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నాట్కో ఫార్మా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా రూ. 341 కోట్లు సమీకరించింది. మంగళవారం సమావేశమైన డెరైక్టర్ల సమావేశంలో క్విప్ ఇష్యూ ధరను నిర్ణయించారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 5 శాతం తక్కువ ధరకు షేర్లను అర్హతకలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు అలాట్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూ. 2,243గా నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ కంటే రూ. 112 తక్కువగా రూ. 2,131కు షేర్లను కేటాయించడం జరిగింది. మొత్తం 16 లక్షల షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 341 కోట్లను సమీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సేకరించిన నిధులతో కంపెనీల విస్తరణ కార్యక్రమాలు, ఫ్లాంట్స్ ఆధునీకరణకు వినియోగించనుంది. రెండేళ్లలో వైజాగ్ యూనిట్ సిద్ధం విశాఖపట్నం రాంకీ సెజ్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ రెండేళ్లలో సిద్ధమవుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన యూనిట్ సివిల్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2017-18 ఆర్థిక ఏడాదికల్లా ఈ యూనిట్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ యూనిట్‌ను సుమారు రూ. 150 కోట్లతో విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు షేర్లుగా విభజన గడిచిన ఏడాది కాలంలో షేరు ధర భారీగా పెరగడంతో ప్రతీ షేరును ఐదు షేర్లుగా విభజించాలని కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్ 26న జరిగే కంపెనీ 32వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రూ. 2గా విభజించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు కంపెనీ రుణ సేకరణ పరిమితిని రూ. 600 నుంచి రూ. 1,000 కోట్లకు పెంచడానికి ఈ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతి తీసుకోనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో షేరు రూ. 2225 వద్ద స్థిరంగా ముగిసింది. -
రుణమాఫీకి నిధుల కటకట
రెండో విడత కింద రూ.2,207 కోట్ల సర్దుబాటుకు తంటాలు తక్షణమే రూ.1,500 కోట్ల రుణ సేకరణకు నిర్ణయం నేడు ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయనున్న ఆర్బీఐ మరో రూ.707 కోట్లు కలిపి నెలాఖరులోగా నిధుల విడుదలకు కసరత్తు బోగస్ బ్యాంకు ఖాతాల గుర్తింపునకు జిల్లాల్లో విస్తృత సర్వే హైదరాబాద్: రైతుల రుణమాఫీ రెండో విడత నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. రెండో ఏడాది బ్యాంకులకు ఇవ్వాల్సిన నిధుల్లో సగం నిధులను గత నెలలో విడుదల చేసిన సర్కారు... మిగతా రూ. 2,207 కోట్లు చెల్లించేందుకు నిధుల్లేక కటకటలాడుతోంది. ఈ నెలాఖరున నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ ఖజానా ఖాళీ కావటంతో వీటిని సర్దుబాటు చేయడం గగనంగా మారింది. దీంతో తక్షణమే రూ.1,500 కోట్లు అప్పు తెచ్చుకోవటం తప్ప గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ఈ రుణాలను సమీకరించేందుకు సిద్ధమైంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం వీటిని వేలం వేయనుంది. దీంతో అంత మేరకు నిధులు సర్దుబాటు కానున్నాయి. ఈ అప్పుతోపాటు మరో రూ.707 కోట్లు కలిపి ఎలాగైనా నెలాఖరుకు రుణమాఫీ నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ పట్టుదలతో ఉంది. రుణమాఫీ నిధుల్లో కొంతమేరకు ఆదా చేసినా గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఆశిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించటం ఇది రెండోసారి కావడం గమనార్హం. బోగస్ ఖాతాలపై నజర్... గత నెల విడుదల చేసిన రుణమాఫీ నిధులకు సంబంధించి వినియోగం ఇంకా పూర్తి కాలేదని.. బ్యాంకర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రెండో విడత నిధులను వచ్చే నెలలో ఇచ్చినా ఫర్వాలేదని ప్రభుత్వం భావిస్తోంది. తొలి ఏడాది రూ.4,250 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేయగా అందులో దాదాపు రూ.140 కోట్లు రైతుల ఖాతాలకు రీయింబర్స్ కాకుండా మిగిలిపోయాయి. ఇవన్నీ బోగస్ ఖాతాలని ఆర్థికశాఖ అనుమానిస్తోంది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనే ఈ మిగులు నిధులు ఎక్కువగా ఉన్నాయి. ప్రయోగాత్మకంగా ఆ రెండు జిల్లాల్లో ప్రభుత్వం రైతుల రుణాలపై విస్తృత సర్వే చేయించటమే అందుకు ప్రధాన కారణం. నిజంగానే ఆ రైతు ఉన్నారా.. లేకుండానే బోగస్ పేర్లతో రుణం తీసుకున్నారా...పాసు పుస్తకాలు అసలైనవేనా.. తక్కువ భూమి ఉన్నా ఎక్కువ చూపించి రుణం పొందారా... పంట రుణం పేరుతో వ్యాపారానికేమైనా రుణాలను మళ్లించారా.. అని ఆరా తీసింది. ఈ ప్రయోగం కొంతమేరకు నిధులను ఆదా చేసిందనే ఆలోచనతో ఆర్థికశాఖ మిగతా జిల్లాల్లోనూ ఇంటెన్సివ్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులతోపాటు బ్యాంకర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో మిగతా జిల్లాలో కనీసం మరో రూ.200 కోట్లు ఆదా అవుతుందని సర్కారు భావిస్తోంది. ఆర్థికంగా ఆ మేరకు భారం తగ్గుతుందని అంచనా వేసుకుంటోంది. రైతు రుణాలకు బ్యాంకుల ససేమిరా! రుణ మాఫీ నిధులు అరకొరగా విడుదల చేయటంతో క్షేత్రస్థాయిలో ఖరీఫ్ రుణాల పంపిణీ చేసేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. ఇంటెన్సివ్ సర్వే పూర్తయ్యేంత వరకు ఇవ్వకుండా ఉండే ధోరణితో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. పైలట్ సర్వేగా బోగస్ రైతులను గుర్తించిన ఖమ్మం జిల్లాలో గత నెల ఇచ్చిన తొలి విడత నిధులనూ విడుదల చేసేందుకు అక్కడి జిల్లా యంత్రాంగం మోకాలడ్డింది. అన్ని జిల్లాల్లో విడుదలైన మరుసటి రోజునే బ్యాంకర్లకు డబ్బులు విడుదల చేస్తే.. రెండు వారాల వరకు ఖమ్మం జిల్లాలో నిధులు ఆగిపోయాయి. ఇటీవల సీఎం హరితహారం జిల్లా పర్యటనకు వెళుతున్న సమాచారంతో ఆగమేఘాలపై ఆర్థికశాఖ అధికారులు జోక్యం చేసుకొని ఈ నిధులు విడుదల చేయించారు. దీంతో ఖరీఫ్ రుణాల పంపిణీపై ప్రభావం పడింది. -
సొసైటీల్లో ముమ్మరంగా రుణాల వసూళ్లు
కాళ్ల :జిల్లాలోని సొసైటీలు రైతుల నుంచి రుణాల వసూళ్లను ముమ్మరం చేశాయి. రుణమాఫీ ప్రయోజనం పెద్దగా లేకపోవడంతో రైతులు రుణాలు చెల్లించవలసి వస్తోంది. జిల్లాలో 258 సహకార సంఘాల్లో సుమారు 2 లక్షల 50 వేల మంది రైతులకు డీసీసీబీ రూ.1200 కోట్లు పంట రుణాలుగా అందజేసింది. రుణం పూర్తిగా చెల్లించలేకపోతే కనీసం వడ్డీ అయినా కట్టి రుణం రెన్యువల్ చేయించుకోవాలని సొసైటీ సిబ్బంది రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోపక్క అరకొర రుణమాఫీతో రైతులకు ప్రయోజనం చేకూరలేదు. జిల్లాలో రూ. 1200ల కోట్లు రుణాలు ఉండగా మొదటి విడతలో రూ. 190 కోట్లు, రెండవ విడతలో రూ. 70 కోట్లు మొత్తం రూ.260 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ సొమ్ము విడుదలయింది. 21 శాతం మాత్రమే రైతులకు ప్రయోజనం చేకూరింది. ఎంత ఆలస్యమైనా వడ్డీతో రుణమాఫీ సొమ్ము ఇస్తామన్న ప్రభుత్వం 2013 డిసెంబర్ 31 నాటికి అయిన వడ్డీని మాత్రమే రుణమాఫీలో నమోదు చేసింది. అప్పటి నుంచి వడ్డీ రైతే చెల్లించవలసి వస్తుంది. ఏడాదిన్నర వడ్డీ అంటే 1000కి రూ.136లు అంటే లక్షకు రూ.13 వేల 600ల వడ్డీ అదనంగా కట్టవలసి వస్తుంది. ప్రభుత్వం రూ.లక్ష ఉన్న రైతుకు కేవలం రూ.20 వేలు మాత్రమే రుణమాఫీ అందజేసింది. ప్రస్తుతం సొసైటీల్లోకి వెళుతున్న రైతులు రుణమాఫీ సొమ్ము పోగా ఇన్సూరెన్స్, వడ్డీ నిమిత్తం అదనంగా తమ జేబులో సొమ్ము చెల్లించవలసి వస్తోంది. దీంతో రైతులు రుణమాఫీపై పెదవి విరుస్తున్నారు. కుటుంబం మొత్తం రూ.50 వేలు లోపే రుణం పొంది, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు అన్నీ సక్రమంగా ఉన్న వారికి మాత్రమే కొద్దిగా ప్రయోజనం కనిపిస్తుంది. సున్నా వడ్డీకి మంగళం రుణమాఫీ ముసుగులో పంట రుణాలపై సున్నా వడ్డీని ఎత్తివేసినట్టు కనపడుతోంది. జిల్లాలో అన్ని సొసైటీలు రుణాలపై రైతుల వద్ద నుంచి ఏడాదికి 7 శాతం, ఆపైన 11 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం నిమిత్తం 6 శాతం అంటే లక్షకు రూ. 6 వేలు వసూలు చేస్తున్నాయి. రుణమాఫీ మాట దేవుడెరుగు కనీసం సున్నా వడ్డీనైనా అమలు చేయమని రైతులు కోరుతున్నారు. అడ్రస్ లేని 6 శాతం వడ్డీ రాయితీ డీసీసీబీ జిల్లాలోని రైతులకు సొసైటీల ద్వారా ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్ల కొనుగోలు, చేపల చెరువుల తవ్వకాలు తదితరాల నిమిత్తం దీర్ఘకాలిక రుణాలు అందజేస్తూ ఉంటుంది. సుమారు రూ. 300 కోట్ల వరకు జిల్లాలోని రైతులు దీర్ఘకాలిక రుణాలు పొంది ఉన్నారు. వీటిపై 11 నుంచి 14 శాతం వడ్డీ ఉంది. అయితే రుణం కోసం రైతు దరఖాస్తు చేసుకున్నప్పుడు సక్రమంగా చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని రైతులకు సొసైటీలు, డీసీసీబీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నుంచి వడ్డీ రాయితీని పూర్తిగా నిలిపివేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ప్రశ్నిస్తున్న రైతులకు సమాధానమే కరువైంది. వడ్డీ రాయితీ ఉందనే రుణాలు తీసుకున్నామని ఇప్పుడు రాయితీ ఇవ్వకుండా మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ నిమిత్తం రావలసిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయని ప్రభుత్వం ఇస్తే తప్ప తాము రాయితీ ఇవ్వలేమని డీసీసీబీ అధికారులు అంటున్నారు. -
ఊరు నిండా చీకటి
- 718 పంచాయతీలలో వెలగని వీధి దీపాలు - బిల్లులు కట్టలేదంటూ సరఫరా నిలిపేసిన ట్రాన్స్‌కో - చెల్లించాల్సిన బకాయిలు రూ. 108 కోట్లు - ఆందోళన చెందుతున్న సర్పంచులు - చేతులెత్తేసిన విద్యుత్ అధికారులు మోర్తాడ్: వీధి దీపాలకు సంబంధిం చిన బకాయిల వసూలు కోసం ట్రాన్స్‌కో అధికారులు కొరడా ఝళిపించారు. బకాయిలు చెల్లిం చడం లేదనే కారణంతో గురువారం రాత్రి ఒక్కసారిగా జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల పరిధిలో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో జిల్లా అంతటా గ్రామాలలో చీకట్లు నిండుకున్నాయి. జిల్లాలోని మేజర్ పంచాయతీలు రూ.51 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ. 57 కోట్ల బకాయిలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. గతంలోనే వీటి వసూలు కోసం వి ద్యుత్ ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలపివేశారు. ఎన్నికల సందర్భంలోనే వివిధ రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు ఒక్క రోజులోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అప్పట్లో రూ. 91 కోట్ల బకాయిలు పంచాయతీలు చెల్లిం చాల్సి ఉంది. ఎన్నికల తరువాత ప్రభుత్వం ద్వారా లేక పంచాయతీ నిధుల నుంచో విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని సర్పంచులు హమీ ఇవ్వడంతో సరఫరాను కొనసాగించారు. అయినా, బకాయిలు వసూలు కాకపోవడ ం, పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు విద్యు త్ సరఫరాను నిలిపివేశారు. గ్రామాల్లోని వీది దీపాలు వెలుగకపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో ఆం దోళన చెందిన సర్పంచులు అధికారులను ఫోన్లలో వాకబు చే యగా ఉన్నతాధికారుల ఆదేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే సమాధానం లభించింది. కఠిన నిర్ణయం తప్పలేదు గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. బకాయిలను చెల్లించాలని సర్పంచులకు పలుమార్లు నోటీసులు జారీ చేశాం. వారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నాలుగేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలు కోసం మాపై ఎంతో ఒత్తిడి ఉంది. -ప్రభాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ