కాళ్ల :జిల్లాలోని సొసైటీలు రైతుల నుంచి రుణాల వసూళ్లను ముమ్మరం చేశాయి. రుణమాఫీ ప్రయోజనం పెద్దగా లేకపోవడంతో రైతులు రుణాలు చెల్లించవలసి వస్తోంది. జిల్లాలో 258 సహకార సంఘాల్లో సుమారు 2 లక్షల 50 వేల మంది రైతులకు డీసీసీబీ రూ.1200 కోట్లు పంట రుణాలుగా అందజేసింది. రుణం పూర్తిగా చెల్లించలేకపోతే కనీసం వడ్డీ అయినా కట్టి రుణం రెన్యువల్ చేయించుకోవాలని సొసైటీ సిబ్బంది రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
మరోపక్క అరకొర రుణమాఫీతో రైతులకు ప్రయోజనం చేకూరలేదు. జిల్లాలో రూ. 1200ల కోట్లు రుణాలు ఉండగా మొదటి విడతలో రూ. 190 కోట్లు, రెండవ విడతలో రూ. 70 కోట్లు మొత్తం రూ.260 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ సొమ్ము విడుదలయింది. 21 శాతం మాత్రమే రైతులకు ప్రయోజనం చేకూరింది. ఎంత ఆలస్యమైనా వడ్డీతో రుణమాఫీ సొమ్ము ఇస్తామన్న ప్రభుత్వం 2013 డిసెంబర్ 31 నాటికి అయిన వడ్డీని మాత్రమే రుణమాఫీలో నమోదు చేసింది. అప్పటి నుంచి వడ్డీ రైతే చెల్లించవలసి వస్తుంది.
ఏడాదిన్నర వడ్డీ అంటే 1000కి రూ.136లు అంటే లక్షకు రూ.13 వేల 600ల వడ్డీ అదనంగా కట్టవలసి వస్తుంది. ప్రభుత్వం రూ.లక్ష ఉన్న రైతుకు కేవలం రూ.20 వేలు మాత్రమే రుణమాఫీ అందజేసింది. ప్రస్తుతం సొసైటీల్లోకి వెళుతున్న రైతులు రుణమాఫీ సొమ్ము పోగా ఇన్సూరెన్స్, వడ్డీ నిమిత్తం అదనంగా తమ జేబులో సొమ్ము చెల్లించవలసి వస్తోంది. దీంతో రైతులు రుణమాఫీపై పెదవి విరుస్తున్నారు. కుటుంబం మొత్తం రూ.50 వేలు లోపే రుణం పొంది, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు అన్నీ సక్రమంగా ఉన్న వారికి మాత్రమే కొద్దిగా ప్రయోజనం కనిపిస్తుంది.
సున్నా వడ్డీకి మంగళం
రుణమాఫీ ముసుగులో పంట రుణాలపై సున్నా వడ్డీని ఎత్తివేసినట్టు కనపడుతోంది. జిల్లాలో అన్ని సొసైటీలు రుణాలపై రైతుల వద్ద నుంచి ఏడాదికి 7 శాతం, ఆపైన 11 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం నిమిత్తం 6 శాతం అంటే లక్షకు రూ. 6 వేలు వసూలు చేస్తున్నాయి. రుణమాఫీ మాట దేవుడెరుగు కనీసం సున్నా వడ్డీనైనా అమలు చేయమని రైతులు కోరుతున్నారు.
అడ్రస్ లేని 6 శాతం వడ్డీ రాయితీ
డీసీసీబీ జిల్లాలోని రైతులకు సొసైటీల ద్వారా ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్‌ల కొనుగోలు, చేపల చెరువుల తవ్వకాలు తదితరాల నిమిత్తం దీర్ఘకాలిక రుణాలు అందజేస్తూ ఉంటుంది. సుమారు రూ. 300 కోట్ల వరకు జిల్లాలోని రైతులు దీర్ఘకాలిక రుణాలు పొంది ఉన్నారు. వీటిపై 11 నుంచి 14 శాతం వడ్డీ ఉంది. అయితే రుణం కోసం రైతు దరఖాస్తు చేసుకున్నప్పుడు సక్రమంగా చెల్లిస్తే 6 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని రైతులకు సొసైటీలు, డీసీసీబీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది నుంచి వడ్డీ రాయితీని పూర్తిగా నిలిపివేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ప్రశ్నిస్తున్న రైతులకు సమాధానమే కరువైంది. వడ్డీ రాయితీ ఉందనే రుణాలు తీసుకున్నామని ఇప్పుడు రాయితీ ఇవ్వకుండా మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ నిమిత్తం రావలసిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయని ప్రభుత్వం ఇస్తే తప్ప తాము రాయితీ ఇవ్వలేమని డీసీసీబీ అధికారులు అంటున్నారు.
సొసైటీల్లో ముమ్మరంగా రుణాల వసూళ్లు
Published Wed, May 20 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM
Advertisement
Advertisement