రుణమాఫీకి నిధుల కటకట | oan waiver financing bars | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి నిధుల కటకట

Published Tue, Jul 14 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

రుణమాఫీకి నిధుల కటకట

రుణమాఫీకి నిధుల కటకట

రెండో విడత కింద రూ.2,207 కోట్ల సర్దుబాటుకు తంటాలు
తక్షణమే రూ.1,500 కోట్ల రుణ సేకరణకు నిర్ణయం
నేడు ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయనున్న ఆర్‌బీఐ
మరో రూ.707 కోట్లు కలిపి నెలాఖరులోగా నిధుల విడుదలకు కసరత్తు
బోగస్ బ్యాంకు ఖాతాల గుర్తింపునకు జిల్లాల్లో విస్తృత సర్వే

 
హైదరాబాద్: రైతుల రుణమాఫీ రెండో విడత నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. రెండో ఏడాది బ్యాంకులకు ఇవ్వాల్సిన నిధుల్లో సగం నిధులను గత నెలలో విడుదల చేసిన సర్కారు... మిగతా రూ. 2,207 కోట్లు చెల్లించేందుకు నిధుల్లేక కటకటలాడుతోంది. ఈ నెలాఖరున నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ ఖజానా ఖాళీ కావటంతో వీటిని సర్దుబాటు చేయడం గగనంగా మారింది. దీంతో తక్షణమే రూ.1,500 కోట్లు అప్పు తెచ్చుకోవటం తప్ప గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ఈ రుణాలను సమీకరించేందుకు సిద్ధమైంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మంగళవారం వీటిని వేలం వేయనుంది. దీంతో అంత మేరకు నిధులు సర్దుబాటు కానున్నాయి. ఈ అప్పుతోపాటు మరో రూ.707 కోట్లు కలిపి ఎలాగైనా నెలాఖరుకు రుణమాఫీ నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ పట్టుదలతో ఉంది. రుణమాఫీ నిధుల్లో కొంతమేరకు ఆదా చేసినా గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఆశిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించటం ఇది రెండోసారి కావడం గమనార్హం.

బోగస్ ఖాతాలపై నజర్...
 గత నెల విడుదల చేసిన రుణమాఫీ నిధులకు సంబంధించి వినియోగం ఇంకా పూర్తి కాలేదని.. బ్యాంకర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రెండో విడత నిధులను వచ్చే నెలలో ఇచ్చినా ఫర్వాలేదని ప్రభుత్వం భావిస్తోంది. తొలి ఏడాది రూ.4,250 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేయగా అందులో దాదాపు రూ.140 కోట్లు రైతుల ఖాతాలకు రీయింబర్స్ కాకుండా మిగిలిపోయాయి. ఇవన్నీ బోగస్ ఖాతాలని ఆర్థికశాఖ అనుమానిస్తోంది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనే ఈ మిగులు నిధులు ఎక్కువగా ఉన్నాయి. ప్రయోగాత్మకంగా ఆ రెండు జిల్లాల్లో ప్రభుత్వం రైతుల రుణాలపై విస్తృత సర్వే చేయించటమే అందుకు ప్రధాన కారణం.

నిజంగానే ఆ రైతు ఉన్నారా.. లేకుండానే బోగస్ పేర్లతో రుణం తీసుకున్నారా...పాసు పుస్తకాలు అసలైనవేనా.. తక్కువ భూమి ఉన్నా ఎక్కువ చూపించి రుణం పొందారా... పంట రుణం పేరుతో వ్యాపారానికేమైనా రుణాలను మళ్లించారా.. అని ఆరా తీసింది. ఈ ప్రయోగం కొంతమేరకు నిధులను ఆదా చేసిందనే ఆలోచనతో ఆర్థికశాఖ మిగతా జిల్లాల్లోనూ ఇంటెన్సివ్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులతోపాటు బ్యాంకర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో మిగతా జిల్లాలో కనీసం మరో రూ.200 కోట్లు ఆదా అవుతుందని సర్కారు భావిస్తోంది. ఆర్థికంగా ఆ మేరకు భారం తగ్గుతుందని అంచనా వేసుకుంటోంది.
 
 
 రైతు రుణాలకు
 బ్యాంకుల ససేమిరా!
 
 రుణ మాఫీ నిధులు అరకొరగా విడుదల చేయటంతో క్షేత్రస్థాయిలో ఖరీఫ్ రుణాల పంపిణీ చేసేందుకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి. ఇంటెన్సివ్ సర్వే పూర్తయ్యేంత వరకు ఇవ్వకుండా ఉండే ధోరణితో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. పైలట్ సర్వేగా బోగస్ రైతులను గుర్తించిన ఖమ్మం జిల్లాలో గత నెల ఇచ్చిన తొలి విడత నిధులనూ విడుదల చేసేందుకు అక్కడి జిల్లా యంత్రాంగం మోకాలడ్డింది. అన్ని జిల్లాల్లో విడుదలైన మరుసటి రోజునే బ్యాంకర్లకు డబ్బులు విడుదల చేస్తే.. రెండు వారాల వరకు ఖమ్మం జిల్లాలో నిధులు ఆగిపోయాయి. ఇటీవల సీఎం హరితహారం జిల్లా పర్యటనకు వెళుతున్న సమాచారంతో ఆగమేఘాలపై ఆర్థికశాఖ అధికారులు జోక్యం చేసుకొని ఈ నిధులు విడుదల చేయించారు. దీంతో ఖరీఫ్ రుణాల పంపిణీపై ప్రభావం పడింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement