రుణ మాఫీతో ప్రయోజనం శూన్యం
రైతులకు కొత్తగా రుణాలిచ్చేందుకు అడ్డుతగులుతాయ్
ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు
ఉదయ్‌పూర్: ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ రుణ మాఫీ పథకాలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా, రైతులకు కొత్తగా రుణాలను విడుదల చేసే అంశంలో బ్యాంకులకు అడ్డుతగులుతాయని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో రుణ మాఫీ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.
అయితే ఇవి ఏపాటి ప్రభావాన్ని చూపుతున్నాయంటూ ప్రశ్నిం చారు. నిజానికి వీటి వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరడంలేదన్న విషయాన్ని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ ఎకనమిక్ అసోసియే షన్ నిర్వహించిన వార్షిక సదస్సుకు హాజరైన రాజన్ పలు అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.
ఆత్మహత్యలపై...
రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ సున్నితమైన ఈ అంశంపై తగిన స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నదని రాజన్ చెప్పారు. వ్యవసాయ రంగంలో భారీగా పేరుకుపోయిన రుణాలను తగ్గించే విషయంలో తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రైతు ఆత్మహత్యల వంటి అత్యంత ప్రధాన అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉన్నదని పేర్కొన్నారు.