
సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈఓడీబీ)లో సంస్కరణలను సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు వీలుగా అనుమతి ఇచ్చినట్టు తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు సంస్కరణ అమలు చేసి ఆ మేరకు రుణ సేకరణ పరిమితి పెంచుకున్న ఏపీ తాజాగా సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచి మరింత రుణ సేకరణకు అర్హత పొందింది. (లక్షకు చేరువలో మరణాలు)
ఈ మేరకు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.25% అదనపు రుణం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లయింది. దీంతో బహిరంగ మార్కెట్ ద్వారా రూ.2,525 కోట్ల మేర అదనంగా రుణం తెచ్చుకునేందుకు అర్హత పొందింది. జిల్లా స్థాయిలో అనుమతులు మంజూరు చేసే 40 సంస్కరణలతోపాటు ఆన్‌లైన్ ద్వారా కేంద్రీకృత ఇన్‌స్పెక్షన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లుగా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్ధారించడంతో కేంద్రం ఈ సదుపాయాన్ని కల్పించింది.