సర్కారీ సారాపై కసరత్తు ! | Government has to declare of produce liquor for public | Sakshi
Sakshi News home page

సర్కారీ సారాపై కసరత్తు !

Published Wed, Jan 21 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

సర్కారీ సారాపై కసరత్తు !

సర్కారీ సారాపై కసరత్తు !

* గుడుంబాకు ప్రత్యామ్నాయంగా తెచ్చే ప్రయత్నాలు
* విధివిధానాలు రూపొందించే పనిలో అధికార యంత్రాంగం
* ఏటా వందల సంఖ్యలో పేదలను మింగుతున్న నాటుసారా
* రాజధాని నుంచి పల్లెల వరకు అంతటా గుడుంబా బాధితులే
* గత ఏడాది 9 నెలల్లోనే 51 లక్షల లీటర్ల నాటుసారా పట్టివేత
* అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం
* ఆరోగ్యకరమైన ప్రమాణాలతో ప్రభుత్వ సారా తయారీకి అధికారుల ప్రతిపాదన
* మహారాష్ట్ర ‘దేశీ దారూ’ తరహాలో వైన్‌షాపుల ద్వారా విక్రయించే యోచన
* ప్రజారోగ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకుంటామంటున్న ప్రభుత్వ వర్గాలు

 
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలను హరిస్తున్న నాటుసారాను అరికట్టేందుకు స్వయంగా సారాయిని ఉత్పత్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. దీనిపై ప్రజా వ్యతిరేకత వస్తుందని ముందుగా సంశయించినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న నాటుసారా తయారీ, అమ్మకాలను అరికట్టాలంటే అదొక్కటే మార్గమని సర్కారు గట్టిగా భావిస్తోంది. గుడుంబా వల్ల ఎదురవుతున్న అనర్థాలను ప్రజలకు వివరించిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతోంది.
 
 ఈ మేరకు విధివిధానాలను రూపొందించే బాధ్యతను ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. 1993 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ‘వారుణి వాహిణి’ పేరుతో సర్కారీ సారా పొట్లాల అమ్మకాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సారా వ్యతిరేక ఉద్యమం రావడంతో వాటి అమ్మకాలను అప్పటి ప్రభుత్వం నిషేధించింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సర్కారీ సారా ఊసులేకపోయినా.. నాటుసారా(ఐడీ లిక్కర్), గుడుంబా పేరుతో ప్రైవేటు దందా విచ్చలవిడిగా మారింది. దీని కోరల్లో చిక్కి పేద కుటుంబాలు నలిగిపోతున్నాయి.
 
  హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాటుసారా వ్యాపారం కుటీర పరిశ్రమను మించిపోయింది. ఆబ్కారీ శాఖ అప్పుడప్పుడు చేసే దాడుల్లో పట్టుబడుతున్న నాటుసారా అంతంతమాత్రమే. యూరియా, కుళ్లిన పండ్లు, బెల్లం, బ్యాటరీ పొడి, అరటిపండ్ల తొక్కలు వంటి  వ్యర్థాలతోపాటు విషపూరిత రసాయనాలతో బట్టీలు పెట్టి దీన్ని తయారు చేస్తున్నారు. గుడుంబాకు అలవాటుపడిన వ్యక్తి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి చివరికి ప్రాణాలమీదకు వస్తుంది. దీనికి బానిసైన వారి వల్ల దిగువ మధ్యతరగతి వర్గాలు, కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఏటా కోటి లీటర్లకు పైగా నాటుసారా ఉత్పత్తి జరుగుతోంది. దీంతో రూ. వంద నుంచి రూ. 150 కోట్ల వ్యాపారం నడుస్తోంది. గుడుంబా అమ్మకాలపై ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌కు స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పర్యటన పూర్తయిన వెంటనే ఎక్సైజ్ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలంటూ యంత్రాంగాన్ని ఆదేశించారు.
 
  దీంతో వారు నివేదికలు రూపొం దించే పనిలో పడ్డారు. గుడుంబాకు బదులుగా ప్రభుత్వమే చీప్ లిక్కర్ కన్నా తక్కువ ధరలో లభించే సారాయిని తయారు చేస్తే పరిస్థితిని అదుపు చేయొచ్చని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది. మహారాష్ట్రలో చీప్ లిక్కర్ కన్నా తక్కువ ధరలో ‘దేశీ దారూ’ పేరుతో సారాయిని వైన్‌షాపులు, బార్లలో ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే గుడుంబాను నియంత్రించడంతో పాటు ‘ఆరోగ్యకరమైన ప్రమాణాలతో’ సారాయిని అందించే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
 
 అరకొర దాడులతోనే భారీగా కేసులు
 ఎక్సైజ్, పోలీస్ శాఖ పరోక్ష సహకారం లేకుం డా నాటుసారా ఉత్పత్తి, విక్రయం అసాధ్యమనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. అందుకే తాండాలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు గుట్టు చప్పుడు కాకుండా లక్షల లీటర్ల నాటుసారా తయారీ, అమ్మకాలు సాగుతూ ఉన్నాయి. మరోవైపు నెలనెలా వచ్చే మామూళ్లతో అధికారుల జేబులు నిండుతున్నాయి. హైదరాబాద్‌లో నాటుసారా తయారీకి ధూల్‌పేట పెట్టింది పేరు. ఇక్కడి నుంచి నాటుసారా సీసాలు, పాకెట్లు నగరమంతటికీ సరఫరా అవుతాయి. మంగళ్‌హాట్, సరూర్‌నగర్, మేడ్చెల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ గుడుంబా తయారీ కేంద్రాలున్నాయి.
 
ఇక ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మన్ననూరు, గద్వాల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, గోదావరి ఖని, మంచిర్యాల, బెల్లంపల్లి వంటి  పట్టణాలు నాటుసారా తయారీ కేంద్రాలుగా ఆబ్కారీ శాఖ రికార్డుల్లో నమోదయ్యాయి. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలైన గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లితో పాటు ఆదిలాబాద్, ఉట్నూరు, కాసీపేట మొదలైన ప్రాంతాలన్నీ ఎక్సైజ్ దాడుల్లో తరచూ రికార్డుల్లోకెక్కుతాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో పట్టుబడిన ఐడీ లిక్కర్ 10,53,728 లీటర్లు కాగా, 67,800 కేసులు నమోదయ్యా యి. 27,299 మంది తయారీదారులు, విక్రయదారులు అరెస్టయ్యారు. 9 నెలల్లోనే పదిన్నర లక్షల లీటర్ల గుడుంబాను పట్టుకున్నారంటే.. ఇక విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అధికారులకే అంతుపట్టడం లేదు. అలాగే 2011-12 నుంచి 2013-14 వరకు 51 లక్షల లీటర్ల నాటుసారాను స్వాధీ నం చేసుకొని 3,61,930 కేసులు నమోదు చేశారు.
 
 ఈ సందర్భంగా 1,22,583 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నాటుసారాను అరికట్టడానికి ప్రభుత్వమే ప్రత్యేక డిస్టల్లరీలను ఏర్పాటు చేసి ప్రాణహాని లేని సారాయిని తయారు చేసే ఆలోచనకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై మంగళవారం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి. ఆర్. మీనాను మీడియా ప్రశ్నించగా.. ఓ విధానం లేకుండా తయారు చేస్తున్న గుడుంబా స్థానంలో ప్రభుత్వమే ప్రమాణాలతో కూడిన సారాయిని ఉత్పత్తి చేయించాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. ప్రాణాంతకమైన నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ప్రజలకు హాని కలగకుండా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, రెండు రోజుల్లో అధికారులతో ఎక్సైజ్ మంత్రి పద్మారావు ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్కారీ సారా ఉత్పత్తి, విధివిధానాలపై చర్చించనున్నట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
Advertisement