హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయమూర్తులందరూ దీని కోసం శుక్రవారం మధ్యాహ్నం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సేన్ గుప్తా న్యాయవ్యవస్థకు చేసిన సేవలను ఇరు రాష్ట్రాల ఏజీలు కొనియాడారు. అనంతరం జస్టిస్ గుప్తా తన సుదీర్ఘ న్యాయ ప్రస్తానం గురించి మాట్లాడారు. తనకు సహకరించిన వారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత న్యాయవాదుల సమక్షంలో జరగాల్సిన వీడ్కోలు కార్యక్రమం జరగలేదు. జస్టిస్ గుప్తాకు వీడ్కోలు ఇచ్చే విషయంలో న్యాయవాదులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగడంతో ఆ కార్యక్రమం రద్దు అయింది.