
2 కార్పొరేషన్లు?
ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు
విభజించాకే ఎన్నికలకు వెళ్లే యోచన
జీహెచ్‌ఎంసీని రెండుగా విభజించే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదన సాధ్యం కాదని సంబంధిత నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజాగా దీనికి మరోసారి కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసిన వెంటనే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీని ఉత్తర, దక్షిణ (నార్త్, సౌత్) కార్పొరేషన్లుగా విభజించేందుకు కసరత్తు సాగుతోంది.
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రెండుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఇది అసాధ్యమని ఓ వైపు నిపుణులు అంటుండగా... మరోవైపు దీనిని రెండుగా విభజించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్‌ఎంసీని ఢిల్లీ, ముంబయ్‌లతరహాలో రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వెల్లడించారు. తాజా సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీని రెండు (నార్త్, సౌత్‌లుగా) కార్పొరేషన్లుగా విభజించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అభిప్రాయం తొలుత వినిపించింది.
రాజకీయ అవసరాలు, వివిధ పార్టీల బలాబలాలు, తమతో కలిసివచ్చే పార్టీలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండైతేనే మేలనే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ జెండాను ఎగురవేయాలనే కృతనిశ్చయంతో ఉన్న టీఆర్‌ఎస్.. జీహెచ్‌ఎంసీగా ఒక్కటే ఉంటే విజయావకాశాలు సులువు కాదనే భావనతో ‘రెండింటి’ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉండటం.. కేంద్రంలోని అధికార బీజేపీతో పొత్తు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ మైత్రి కొనసాగుతుందని ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
3 తర్వాత వేగవంతం
డిసెంబర్ 3వ తేదీతో జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ముగుస్తోంది. ఆ తరువాత విభజన చర్యలు వేగవంతం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలోగానే దీన్ని పూర్తి చేయనున్నారు. విభజన లేకపోయినా ఇప్పటికిప్పుడు పాలకమండలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. వార్డుల డీలిమిటేషన్.. బీసీల గణన పూర్తి కావాల్సి ఉంది. వీటిని పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాలంటే ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుంది. డీలిమిటేషన్‌పై జీహెచ్‌ఎంసీకి ఇంకా మార్గదర్శకాలు అందలేదు. ఈలోగా జీహెచ్‌ఎంసీ విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నది సర్కారు యోచన.
సౌత్..
ఈ కార్పొరేషన్ పరిధిలోకి హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్, బహదూర్‌పురా, కార్వాన్, గోషామహల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని నాంపల్లి, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎల్‌బీనగర్, మెదక్ లోక్‌సభ పరిధిలోని పటాన్‌చెరు, ఆర్‌సీపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.
నార్త్..
నార్త్ కార్పొరేషన్ పరిధిలోకి మల్కాజిగిరి లోక్‌సభలోని ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్‌సభలోని సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకుల అంచనా.