గ్రీన్‌హౌస్ కంపెనీల అత్యాశ | greenhouse companies quotation high in telangana | Sakshi
Sakshi News home page

గ్రీన్‌హౌస్ కంపెనీల అత్యాశ

Published Sat, Jan 3 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

greenhouse companies quotation high in telangana

* చదరపు మీటరుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ. 700  
* కంపెనీల బిడ్డింగ్‌లో కనిష్ట ధర రూ. 840, గరిష్టం రూ. 1260

సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక బిడ్ వివరాలు వెల్లడయ్యాయి. టెండర్లలో పాల్గొన్న కంపెనీలు ప్రభుత్వ నిర్ణీత ధరకు మించి కోట్ చేశాయి. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ఐదో తేదీన చర్చలు జరిపి తుది నిర్ణయానికి రావాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది. కోట్ చేసిన ధరలను తగ్గించేలా రాజీ చేసుకుని సర్కారు మార్గదర్శకాల ప్రకారం అర్హత గల కంపెనీల జాబితాను కమిటీ తయారు చేయనుంది. తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

నిజానికి గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఎకరా స్థలంలో 4 వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మాణాన్ని చేపడితే అందుక య్యే వ్యయం రూ. 28 లక్షలు. ఇందులో 75 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన ఖర్చును రైతు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ కోసం చదరపు మీటరుకు రూ. 140 ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులోనూ రైతుకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. అయితే తాజాగా కంపెనీలు గ్రీన్‌హౌస్‌ల నిర్మాణానికి ఎక్కువ ధరను కోట్ చేశాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో చదరపు మీటరుకు ఇండియన్ గ్రీన్‌హౌస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ కంపెనీ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, తమిళనాడుకు చెందిన అగ్రిఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1035గా ధరలను కోట్ చేశాయి.

తుది ధర ఎంతైనా సర్కారు మాత్రం ఒక్కో చదరపు మీటరుకు ఇప్పటికే నిర్దేశించిన మేరకు రూ. 700 ధర ప్రకారమే 75 శాతం సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన సొమ్మును రైతులే భరించాలని చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు.

Advertisement

పోల్

Advertisement