
విద్యార్థులకు నచ్చజెబుతున్న అధికారులు, పోలీసులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తాము తినే అన్నంలో పురుగులొస్తే సైతం తీసేసి తినమని వార్డెన్ చెబుతున్నారని జిల్లా కేంద్రంలోని తిరుమలాహిల్స్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల గురుకుల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుమలాహిల్స్ వద్ద నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు విద్యార్థినులు ర్యాలీగా వచ్చి, కలెక్టరేట్ ముందు భైఠాయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. అన్నం ఇలాగే ఉంటుందని, లేకుంటే వండుకుని తినాలని వార్డెన్ అనేక సార్లు పేర్కొంటుందన్నారు. హాస్టల్‌లో మూడేళ్ల నుంచి ఉంటూ తాము చదువుతున్నామని, ప్రిన్సిపాళ్లు మారినా హాస్టల్‌లో పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. తమ హాస్టల్‌కు కలెక్టర్, మాజీ విద్యాశాఖ మంత్రి వచ్చి వెళ్లినా సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ప్రహరీ లేకపోవడంతో పాములు, ఇతర జంతువులు హాస్టల్‌లోకి వస్తున్నాయని, వీటి వల్ల ఏ ఇబ్బందులు వచ్చిన ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు.
ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, బాత్‌రూంలు, నీటి వసతి లేకపోవడం వంటి అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎవరైనా చనిపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తే చనిపోయిన దానికి ప్రూఫ్ చూపిస్తేనే పంపిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యలపై అనేక సార్లు రీజినల్ కోఆర్డినేటర్‌తో పాటు పై అధికారులకు ఎన్ని సార్లు నివేదించినా అసలు స్పందిచలేదని, తాము నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నామ న్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు లోకేష్‌నాయక్, రవీందర్, సంతోష్, డీవైఎఫ్‌ఐ నాయకులు రాజ్‌కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment