సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీని తెలంగాణ హజ్ కమిటీగా మార్చుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 లోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కూడా ఉంది. ప్రభుత్వ సంస్థలు కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని పునర్విభజన చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొంటోంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ’ పేరును తెలంగాణ హజ్ కమిటీగా మార్చుతూ తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హజ్ యాత్రికులకు కూడా సేవలు ..
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తోంది. ఇది తెలంగాణ హజ్ కమిటీగా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త కమిటీ ఏర్పాటు అనివార్యమైంది. ఏపీ సర్కార్ కొత్తకమిటీని ఏర్పాటు చేసుకునే వరకు తెలంగాణ హజ్ కమిటీ ఆ రాష్ట్ర హజ్ యాత్రికులకు సైతం సేవలందిస్తుందని తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ కార్యదర్శి అహమ్మద్ నదీమ్ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లు, యాత్రికులకు సౌకర్యాల కల్పనకు అయ్యే ఖర్చును ఆయా రాష్ట్రాల యాత్రికుల సంఖ్య ఆధారంగా రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉందన్నారు.
ఇకపై తెలంగాణ హజ్ కమిటీ..!
Published Sun, Aug 3 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement