haz committee
-
జనవరి రెండోవారంలో హజ్ డ్రా!
న్యూఢిల్లీ: 2018లో హజ్ యాత్రకు వెళ్లే వారికోసం జనవరి రెండో వారంలో డ్రా నిర్వహిస్తామని హజ్ కమిటీ సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సారి వెయ్యిమందికి పైగా మహిళలు మెహ్రమ్(తండ్రి లేదా సోదరుడు లేదా కుమారుడు) తోడులేకుండా హజ్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. హజ్‌యాత్ర దరఖాస్తు తుదిగడువును డిసెంబర్ 7 నుంచి 22కు పెంచినట్లు ఖాన్ పేర్కొన్నారు. మెహ్రమ్ లేకుండా 45 ఏళ్లు దాటిన మహిళల్ని నలుగురిని ఓ బృందంగా హజ్‌కు అనుమతించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
హజ్ సబ్సిడీ రద్దు!
ముంబై: హజ్ యాత్రికులకు సబ్సిడీ రద్దు, మగవారు తోడు లేకుండానే 45 ఏళ్లకు పైబడిన మహిళలు కనీసం నలుగురితో కలసి ప్రయాణించేందుకు అనుమతి...ఇవీ ప్రతిపాదిత హజ్ విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు. 2018–22 కాలానికి ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి శనివారం సంబంధిత నివేదికను సమర్పించారు. యాత్రికులు బయల్దేరే(విమానమెక్కే) ప్రదేశాలను ప్రస్తుతమున్న 21 నుంచి 9కి కుదించాలని, వారిని ఓడల ద్వారా పంపించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా అందులో ప్రతిపాదించారు. ‘2018 సంవత్సరానికి హజ్ యాత్రను నూతన విధానం ఆధారంగానే చేపడతాం. ఇది ఎంతో మెరుగ్గా ఉంది. ప్రజల భద్రత, పారదర్శకత పెంచేలా ఉంది’ అని నక్వీ అన్నారు. సబ్సిడీలో కోత విధించగా ఆదా అయిన నిధులను ముస్లింల సాధికారత, సంక్షేమానికి వినియోగిస్తామని మైనారిటీ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 45 ఏళ్లకు పైబడిన మహిళలను మగ(మెహ్రాన్) తోడు లేకుండా అనుమతించేవారు కాదు. తండ్రి, సోదరుడు, కొడుకు(భర్త కాకుండా) లాంటి సంబంధీకులని మెహ్రాన్ అంటారు. 45 ఏళ్ల లోపు ఉన్న మహిళల వెంట మాత్రం మెహ్రాన్లు ఉండాల్సిందే. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాజా విధానాన్ని రూపొందించారు. మరిన్ని ప్రతిపాదనలు: ► మెహ్రాన్ల కోటా 500కు పెంపు ► యాత్రికులు విమానమెక్కే స్థానాలను హైదరాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులకు పరిమితం చేయాలి ► ఈ ప్రాంతాల్లో హజ్ హౌస్‌లను ఏర్పాటుచేసి, వాటిని అన్ని జిల్లాలతో అనుసంధానించాలి ► విమాన ప్రయాణంతో పోల్చితే చవకైన ఓడల ద్వారా యాత్రికులను పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. ► హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల మధ్య 70:30 నిష్పత్తిలో కోటా పంపిణీని హేతుబద్ధీకరించాలి ► బిడ్డింగ్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడకుండా నిరోధించాలి. -
ఇకపై తెలంగాణ హజ్ కమిటీ..!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీని తెలంగాణ హజ్ కమిటీగా మార్చుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 లోని పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కూడా ఉంది. ప్రభుత్వ సంస్థలు కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని పునర్విభజన చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొంటోంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ’ పేరును తెలంగాణ హజ్ కమిటీగా మార్చుతూ తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హజ్ యాత్రికులకు కూడా సేవలు .. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తోంది. ఇది తెలంగాణ హజ్ కమిటీగా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త కమిటీ ఏర్పాటు అనివార్యమైంది. ఏపీ సర్కార్ కొత్తకమిటీని ఏర్పాటు చేసుకునే వరకు తెలంగాణ హజ్ కమిటీ ఆ రాష్ట్ర హజ్ యాత్రికులకు సైతం సేవలందిస్తుందని తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాకుల సంక్షేమ శాఖ కార్యదర్శి అహమ్మద్ నదీమ్ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లు, యాత్రికులకు సౌకర్యాల కల్పనకు అయ్యే ఖర్చును ఆయా రాష్ట్రాల యాత్రికుల సంఖ్య ఆధారంగా రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉందన్నారు.