హజ్‌ సబ్సిడీ రద్దు! | Draft Haj Policy Proposes Abolishing Haj Subsidy | Sakshi
Sakshi News home page

హజ్‌ సబ్సిడీ రద్దు!

Published Sun, Oct 8 2017 1:48 AM | Last Updated on Sun, Oct 8 2017 9:12 AM

Draft Haj Policy Proposes Abolishing Haj Subsidy

ముంబై: హజ్‌ యాత్రికులకు సబ్సిడీ రద్దు, మగవారు తోడు లేకుండానే 45 ఏళ్లకు పైబడిన మహిళలు కనీసం నలుగురితో కలసి ప్రయాణించేందుకు అనుమతి...ఇవీ ప్రతిపాదిత హజ్‌ విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు. 2018–22 కాలానికి ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అఫ్జల్‌ అమానుల్లా నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీకి శనివారం సంబంధిత నివేదికను సమర్పించారు.
యాత్రికులు బయల్దేరే(విమానమెక్కే) ప్రదేశాలను  ప్రస్తుతమున్న 21 నుంచి 9కి కుదించాలని, వారిని ఓడల ద్వారా పంపించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా అందులో ప్రతిపాదించారు. ‘2018 సంవత్సరానికి హజ్‌ యాత్రను నూతన విధానం ఆధారంగానే చేపడతాం. ఇది ఎంతో మెరుగ్గా ఉంది. ప్రజల భద్రత, పారదర్శకత పెంచేలా ఉంది’ అని నక్వీ అన్నారు. సబ్సిడీలో కోత విధించగా ఆదా అయిన నిధులను ముస్లింల సాధికారత, సంక్షేమానికి వినియోగిస్తామని మైనారిటీ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటి వరకు 45 ఏళ్లకు పైబడిన మహిళలను మగ(మెహ్రాన్‌) తోడు లేకుండా అనుమతించేవారు కాదు. తండ్రి, సోదరుడు, కొడుకు(భర్త కాకుండా) లాంటి సంబంధీకులని మెహ్రాన్‌ అంటారు. 45 ఏళ్ల లోపు ఉన్న మహిళల వెంట మాత్రం మెహ్రాన్‌లు ఉండాల్సిందే. 2022 నాటికి హజ్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తాజా విధానాన్ని రూపొందించారు.

మరిన్ని ప్రతిపాదనలు:
►  మెహ్రాన్‌ల కోటా 500కు పెంపు
►  యాత్రికులు విమానమెక్కే స్థానాలను హైదరాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులకు పరిమితం చేయాలి
►  ఈ ప్రాంతాల్లో హజ్‌ హౌస్‌లను ఏర్పాటుచేసి, వాటిని అన్ని జిల్లాలతో అనుసంధానించాలి
►  విమాన ప్రయాణంతో పోల్చితే చవకైన ఓడల ద్వారా యాత్రికులను పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.  
►  హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్ల మధ్య 70:30 నిష్పత్తిలో కోటా పంపిణీని హేతుబద్ధీకరించాలి
►  బిడ్డింగ్‌ ప్రక్రియలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడకుండా నిరోధించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement