సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ) ఎలక్ట్రో మెకానికల్ పరికరాల (ఈఅండ్‌ఎం) ధరల పెంపు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈఅండ్‌ఎం ధరల పెంపు, కాంట్రాక్ట్ ఖరారు విషయంలో అక్రమాలూ చోటు చేసుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఖరారులో మోసం జరిగిందనేందుకు నాగం ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయారని తేల్చి చెప్పింది.
అలాగే ప్యాకేజీ 5 ధరల విషయంలో మేఘా ఇంజనీరింగ్, నవ యుగ కంపెనీలతో అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో సైతం తాము ఏకీభవించడం లేదంది. అలాగే బీహెచ్‌ఈఎల్–మేఘా ఇంజనీరింగ్ జాయింట్ వెంచర్‌కు కాం ట్రాక్ట్ అప్పగింత ఏకపక్ష నిర్ణయం కాదని, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే కాంట్రాక్ట్ అప్పగింత నిర్ణయం జరిగిందని తెలిపింది. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంది. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు పిటిషనర్ ఎటువంటి ఆధారాలను తమ ముందుంచలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ ఎలక్ట్రో మెకానికల్ పరికరాల ధరల పెంపు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్యాకేజీ 5లో మొత్తం 9 పంప్ అండ్ మోటార్ల ధరను ఏకపక్షంగా రూ.1,729 కోట్ల నుంచి రూ.2,436 కోట్లకు పెంచారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి గతంలో తీర్పు వాయిదా వేసిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.
నిర్ధిష్ట పద్ధతిలోనే ఇస్కీ లెక్కలు..
‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) పలు ప్రత్యాయ్నాయాలు ఉన్నప్పటికీ, పీఆర్‌ఆర్‌ఎల్‌ఐపీ అంచనా వ్యయాన్ని ఓ నిర్ధిష్ట పద్ధతిలోనే లెక్కించింది. ఇస్కీవి కేవలం అంచనాలే తప్ప, తుది లెక్కలు కావు. ఇస్కీ అంచనా లెక్కలను అంతిమంగా సమీక్షించాల్సింది ప్రభుత్వమే. ఇదే విషయాన్ని ఇస్కీ సైతం అంగీకరిస్తోంది. 1,5,8,16 ప్యాకేజీల్లో ఈఅండ్‌ఎంతో పంపు హౌస్‌ల నిర్మాణం జరగాల్సి ఉంది. సివిల్ నిర్మాణ పనులు, సొరంగ నిర్మాణ పనులు, హైడ్రో మెకానికల్ పనులు, ఈఅండ్‌ఎం పనులు ఇందులో భాగం.
ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత ఐదేళ్ల పాటు ప్లాంట్ నిర్వహణ కూడా చేపట్టాల్సి ఉంది. సివిల్ నిర్మాణ పనులు, సొరంగ నిర్మాణ పనులు, నిర్వహణ పనులు చేపట్టే అర్హత, అనుభవం లేదని బీహెచ్‌ఈఎల్ చెబుతోంది. అందువల్లే బిడ్ నిబంధనల ప్రకారం మేఘా ఇంజనీరింగ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డామని చెప్పింది. డిజైన్, తయారీ, రవాణా, ట్రాన్సిట్ రిస్క్ ఇన్సూరెన్స్, పంపులు, మోటార్ల బిగింపు పర్యవేక్షణ తదితరాలన్నీ కూడా మేఘా ఇంజనీరింగ్ బాధ్యత. పంపులు, మోటార్ల సరఫరా, వాటిని విడిభాగాలుగా నిర్దేశిత ప్రాంతానికి తరలించాల్సిన బాధ్యత మాత్రమే బీహెచ్‌ఈఎల్‌ది. మిగిలిన బాధ్యతలన్నీ కూడా మేఘా ఇంజనీరింగ్‌దే. ప్రాజెక్టు అమలులో ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నందున ఈఅండ్‌ఎం ధరల పెంపును, కాంట్రాక్ట్ ఖరారును ఏకపక్షంగా పరిగణించలేం. మేఘా, నవయుగలతో అధికారులు కుమ్మక్కయ్యారన్న నాగం వాదనను ఆమోదించలేకపోతున్నాం. అలాగే సీబీఐ దర్యాప్తునకూ ఆదేశించాల్సిన అవసరమూ కనిపించడం లేదు.’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment