మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి
అచ్చంపేట : ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకపోయింది.. ఏ ప్రాజెక్టు చేపట్టినా అవినీతి మయమే.. కేసీఆర్ ఒక్కడివల్లే తెలంగాణ రాలె.. 2011లో ఆయన ఉద్యమం ఆపేస్తే నగారా సమితి పెట్టి అదిలాబాద్, పరిగి, నిజామాబాద్‌లో లక్షల మందితో ఐక్యత దీక్ష సభలు పెట్టాను.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని భరోసా ఇచ్చాను.. కేసీఆర్ ఒక్కరోజైన బలిదానాలు చేసుకోవద్దని చెప్పాడా..? తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే తెచ్చింది నేనేనని ప్రకటించుని పబ్బం గడుపుకుంటున్నడు.. ఆ పార్టీని బొంద పెట్టే వరకు నిద్రపోను’ అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శనివారం శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, నాగం అనుచరులు సుమారుగా 150 వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగం విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే చలించి పోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని, ఉద్యమం వల్ల తెలంగాణ రాలేదని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే వచ్చిందన్నారు.
ఉమామహేశ్వరుల సన్నిధి నుంచే ఉద్యమం
పీకల్లోతు అవినీతిలో కూరకపోయిన టీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు ఉమామహేశ్వరం క్షేత్రం నుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టానని నాగం స్పష్టం చేశారు. ఇకనుంచి ప్రతి గ్రామం తిరిగి టీఆర్‌ఎస్ అవినీతి బాగోతం ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేస్తానన్నారు. కేసీఆర్ కుటుంబానికి అందెలం ఎక్కించి అందిన కాడికి దోచుకుంటున్నాడని, భవిష్యత్‌లో శశికళకు పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందన్నారు. నిరుద్యోగ సమ స్య, ఆకలి బాధలు ఉండవని, నీళ్లు, నిధులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఎంత అవనితికి పాల్పడుతున్నారో తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టును నిద్రపోయేలా చేసిందని ఆరోపించారు. మొదటి లిప్ట్ రూ. 2,098 కోట్లకు టెండరు ఇచ్చారని దాని విలువ రూ.700 కోట్లు మాత్రమేనని, అయినా ఇంత వరకు కేవలం రూ.50కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను ప్రారంభించారని, ఇన్నిరోజులైనా కెఎల్‌ఐ కింద కనీసం డిస్టిబ్యూటర్ చానల్స్ కూడా చేయలేదని, అయినా ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెబుతున్నారని ఎక్కడ అందించారో చూయించాలని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం నిధులు పెంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారే తప్ప మరోటి లేదన్నారు. పాల మూరు ప్రయోజనాలు పక్కన బెట్టి నల్లగొండకు నీళ్లు తీసికెళ్లుతామంటే చూస్తూ ఊరుకోమని, మక్తల్ వద్ద కృష్ణానది ఉంటే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు తీసేకెళ్లడం చూస్తే వీరి పరిజ్ఞానం ఏమేరకు ఉందో అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు జగదీశ్వర్‌రావు, జెడ్పీటీసీలు ధర్మానాయక్, కొండ మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు పాలమూరు యాదయ్య, కాశన్న యాదవ్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment