నంబర్ 1 గుర్తింపు తెస్తా | Highlighting No. 1 | Sakshi
Sakshi News home page

నంబర్ 1 గుర్తింపు తెస్తా

Published Sat, Jan 17 2015 4:14 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

నంబర్ 1 గుర్తింపు తెస్తా - Sakshi

నంబర్ 1 గుర్తింపు తెస్తా

మహబూబ్‌నగర్ టౌన్: తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు కలెక్టర్‌గా రావడం దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నట్లు నూతన కలెక్టర్ టీకే శ్రీదేవి చెప్పారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. కలెక్టర్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... ‘ ఈ జిల్లాలో 2000నుంచి 2004వరకు వాటర్‌షెడ్ పథకం, డ్వామాను తీసుకురావడంలో నా కృషి చాలా ఉందని చెప్పొచ్చు. అక్కడ్నుంచి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పునరావాస పనులు కల్పించడంలో జిల్లాకు రెండేళ్లుగా ఇన్‌చార్జిగా వ్యవహరించా.

వీటిని సాధ్యమైనంత వేగవంతంగా పూర్తి చేసేందుకు నా వంతు కృషిచేశా. తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చి నెంబర్‌వన్ జిల్లాగా మారుస్తా. అదేవిధంగా అభివృద్ధి విషయంలో జీవనోపాదులను మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృషి ్టసారిస్తా. జిల్లా వాసులకు అన్ని విధాలుగా మెరుగైన పాలనకు అందించాలన్నది నా ఉద్ధేశం. ఇక ప్రణాళికల విషయానికొస్తే సాగు, తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కృషి చేస్తా.

ప్రస్తుతం సీఎం వీటిపై దృష్టి పెట్టడంతో ఇంకా సులువుగా ఈ సమస్య పరిష్కారం కానుంది. ముందుగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలను ముమ్మరం చేసి సాగు, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా. గత ఏడాది ఎక్కడైతే తాగునీటి సమస్య ఏర్పడిందో వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య లేకుండా చూస్తా. జిల్లాలోని పునరావాస పనులపై ఇప్పటికే పూర్తి అవగాహన కలిగి ఉన్నా, వాటిని పెండింగ్‌కు గురిచేస్తే సహించేది లేదు.

ఒకటి రెండుసార్లు సమీక్షలు నిర్వహించి పెండింగ్‌పై హెచ్చరిస్తా, అయిన పనితీరు మారకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవు. నిబంధనలను తుచ తప్పకుండా పాటించడమే నా లక్ష్యం, ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించి పేదవారికి సేవలందించడమే నా ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తా. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తా, కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధటీంలా తయారు చేసి పేదవాళ్లకు మెరుగైన పాలనను అందించేందుకు కృషి చేస్తా. పేదోళ్లంతా తమకు న్యాయం జరుగుతుందని భావించొచ్చు’. అని అన్నారు.
 
బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
జిల్లా కలెక్టర్‌గా టీకే శ్రీదేవి గురువారం ఉదయం 11గంటలకు బాధ్యతలు చేపట్టారు. బదిలీ అయిన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని కలెక్టర్ చాంబర్‌కు చేరుకొని నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికి చార్జి అప్పగించారు. కాసేపు మాట్లాడిన తరువాత బదిలీ అయిన కలెక్టర్ ప్రియదర్శిని వెంటనే అక్కడ్నుంచి వెళ్తూ అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అదే సమయంలో నూతన కలెక్టర్ ఆమెను కౌగిలించుకొని బెస్ట్ ఆఫ్‌లక్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement