సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్‌మాల్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న మ్యానీటర్ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిని మట్టుపెట్టిన హైదరాబాదీ షార్ప్‌షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్, అతడి తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌లను కేంద్ర మంత్రి మేనకగాంధీ సహా అనేక మంది విమర్శించారు. అయితే యవత్‌మాల్‌కు చెందిన రైతులు, సామాన్యులు మాత్రం మీ రుణం తీర్చుకోలేమంటూ ఈ తండ్రీకొడుకులను ఘనంగా సన్మానించారు. మంగళవారం రాత్రి సావర్ఖేడా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు సహకరించిన వారందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఆదిలాబాద్‌కు 60 కిమీ దూరంలో మహారాష్ట్రలోని తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయస్సున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్‌మాల్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషులను వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూనే ఉంది. ఈ ఆడపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ మూడూ కలిసి యవత్‌మాల్ చుట్టూ ఉన్న 12 కిమీ పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాలను పీక్కు తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు వీటి చేతిలో 14 మంది చనిపోయారు. అక్కడి అటవీ శాఖ కోరిక మేరకు అస్ఘర్, షఫత్ సెప్టెంబర్ రెండో వారంలో అక్కడికి వెళ్లి వేట మొదలెట్టారు. బంధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నెల 3న అవనిని మట్టు పెట్టారు. దీనిపై మేనకగాంధీతో పాటు అనేక మంది జంతు ప్రేమికులు విమర్శలు గుప్పించారు. బాహ్యప్రపంచం ఈ వేటను వివాదాస్పదం చేసినా... యవత్‌మాల్ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు మాత్రం వీరి రుణం తీర్చుకోలేమని చెబుతున్నారు. కొన్ని నెలలుగా తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మ్యానీటర్‌ను చంపిన అస్ఘర్, షఫత్‌లతో పాటు సహాయకుల్నీ మంగళవారం సావర్ఖేడాకు ఆహ్వానించారు. 12 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు వీరిని ఘనంగా సన్మానించారు. మ్యానీటర్ వల్ల వారు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఓ పులి మహిళపై దాడి చేసి తల వేరు చేసినట్లు ఉన్న జ్ఞాపికను వీరికి అందజేశారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న అవని కూనలను బంధించాల్సిందిగా వీరిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment