
చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ గురుకుల టీజీటీ ఉద్యోగానికి అర్హత సాధించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో భాగంగా క్రీమీలేయర్ సర్టిఫికెట్ సమర్పించాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేయడంతో ఆమె సమీప మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంది. కానీ ఓబీసీ జాబితాలో తన బొందిలి కులం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. బీసీ సంక్షేమ శాఖను ఆశ్రయించినా స్పష్టత రాకపోవడంతో ఆమె అయోమయంతో వెనుదిరిగింది.
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాలకు ఎంపికయ్యే అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలకు లోబడి ఉంటే నాన్ క్రీమీలేయర్‌గా పరిగణిస్తారు. దీంతో రిజర్వేషన్ల ఫలాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ జాబితాలో కేవలం 87 కులాలే ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల్లో 119 కులాలున్నాయి. ఈ మేరకు 2016, జనవరి 30న జీవో–4 జారీ చేసింది. మండల రెవెన్యూ యంత్రాంగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ జాబితాను కాదని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 87 కులాలకు మాత్రమే క్రీమీలేయర్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.
అంతా అయోమయం...
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీల్లోని వీరశైవలింగాయత్, లింగ బలిజ, సుందీ, కుర్మి, బెంగ్వా తదితర కులాలతోపాటు ముస్లిం కేటగిరీల్లోని 13 కులాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓబీసీ జాబితాలో లేవు. ఇలాంటి కులాలు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు బీసీ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 32 కులాల అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల టీజీటీ ఉద్యోగాల్లో అర్హత సాధించిన నలుగురు అభ్యర్థులు ఇదే సమస్యపై బీసీ సంక్షేమ శాఖను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది.
మహిళలకు ‘కొత్త’చిక్కులు...
క్రీమీలేయర్ సర్టిఫికెట్ల విషయంలో మహిళలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ విషయంలో వివాహితలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా అభ్యర్థులు తండ్రి వివరాలతోనే ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పదోతరగతి సర్టిఫికెట్‌లో కూడా తల్లి, తండ్రి పేర్లు, తండ్రి ఇంటిపేరు ఉన్నాయి. అయితే, అధికారులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు తండ్రి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగాని, రూ.6లక్షలకు మించి ఆదాయాన్ని గాని కలిగి ఉంటే సదరు అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తున్నారు. దీంతో అలాంటివారు రిజర్వేషన్ అర్హత కోల్పోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం వివాహంకాగా తన భర్త ఆదాయాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి ఆదాయాన్ని పరిగణిస్తూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో ఆమె అయోమయంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment