సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే విషయంలో మహారాష్ట్ర కొత్త నాటకానికి తెరలేపింది. రాష్ట్రానికి దక్కాల్సిన చిన్నపాటి నీటి వాటాను అడ్డుకునేందుకు ఎత్తులు వేస్తోంది. మార్చిలో తెలంగాణకు రావాల్సిన 0.6 టీఎంసీ ల నీటిని విడుదల చేయలేమంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. ఎగువన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ నిల్వలు ఉన్నందున బాబ్లీ నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని విడుదల చేయాల్సిందేనంటూ రాష్ట్రం తెలిపింది.
సుప్రీం చెప్పినా కూడా..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై నాలుగేళ్ల కింద సుప్రీం తీర్పు వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. మార్చి 1న గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తింది. మళ్లీ మార్చి 1న వాటిని తెరవాల్సి ఉంది. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో కేవలం 0.048 టీఎంసీల మేర మాత్రనే నీరుందని మహారాష్ట్ర అంటోంది. దీంతో నీటి విడుదల సాధ్యం కాదని నాందేడ్ చీఫ్ ఇంజనీర్ ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాశారు. మహారాష్ట్రలో బాబ్లీ ఎగువన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 102.73 టీఎంసీలకు గానూ 77.77 టీఎంసీల నిల్వలున్నాయి. గైక్వాడ్ దిగువన విష్ణుపురి ప్రాజెక్టులోనూ 2.7 టీఎంసీల సామర్థ్యానికి గాను 2 టీఎంసీల నిల్వలున్నాయి.
ఎస్సారెస్పీలో 26 టీఎంసీలే..
ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.313 టీఎంసీల సామర్థ్యా నికి గాను 26.98 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో డెడ్‌స్టోరేజీని పక్కనబెడితే లభ్యత జలాలు 10 టీఎంసీలకు మించి ఉండవు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందేనంటూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు నాందేడ్ చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్ర ఎలాంటి నిర్ణయం చేస్తుందో వేచి చూడాలి.
బాబ్లీ నీటిపై ‘మహా’ నాటకం!
Published Sat, Feb 24 2018 3:21 AM | Last Updated on Sat, Feb 24 2018 3:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment