తలకొండపల్లి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు.. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలు మరిచాడు.. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపేశాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
భార్యను చంపిన భర్త
మద్యం మత్తులో ఘాతుకం
అంతారంలో ఘటన
మండలంలోని అంతారానికి చెందిన గొర్రె అంజమ్మ (50), అంజయ్య దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు చిన్నప్పటి నుంచి పోలియో కారణంగా ఓ కాలు పనిచేయదు. భర్త మద్యానికి బానిైసై ఏ పనిచేయకుండా ఊర్లో జులాయిగా తిరగసాగాడు. దీంతో భార్యపైనే కుటుంబ భారం పడటంతో కూలిపని చేస్తోంది. ఇటీవల ఉపాధికోసం కుమారుడు ఇస్తారి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. పెద్దకూతురు గతంలోనే చనిపోగా చిన్న కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది.
ఈ క్రమంలోనే భర్త మద్యం తాగడానికి డబ్బులివ్వాలని తరచూ వేధించసాగాడు. ఎప్పటిలాగే శనివారం రాత్రి అంజమ్మ ఆరుబయట నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి పీకలదాకా తాగి ఇంటికి భర్త వచ్చి భోజనం పెట్టాలని భార్యను లేపి గద్దించాడు. ఉదయం వండిన చల్ల అన్నం తినమనగా కోపంతో గొడ్డలితో మోది చంపేసి పారిపోయాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకట్, ఎస్‌ఐ మహేందర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడే ఉన్న పదునైన ఆయుధం, అగ్గిపెట్టె, రబ్బరుచెప్పుల జత స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.