మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ నరసింహారావు, మృతుడు శ్రీనివాసులు
సాక్షి, ఓజిలి(నెల్లూరు) : పిల్లనిచ్చి వివాహం చేసిన మేనమామను అల్లుడే గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని అత్తివరం గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న కారూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారూరుకు చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (80), అతని భార్య రత్నమ్మకు ఇద్దరు కుమార్తెలున్నారు. మొదటి కుమార్తెను సొంత ఊరులోని వ్యక్తికిచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె ఆదిలక్ష్మిని రత్నమ్మ అన్న మోడిబోయిన కిష్టయ్య కుమారుడైన మోడిబోయిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి రాపూరు మండలం వేపినాపి గ్రామంలో 20 సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై భార్యను నిత్యం చిత్రహింసలను గురిచేసేవాడు. దీంతో ఆమె ఐదు సంవత్సరాలు క్రితం పుట్టింటికి వచ్చేసింది. నిందితుడు అప్పుడప్పుడు అత్తివరం గ్రామానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు.
తనతో పంపలేదని..
రెండునెలల క్రితం భార్య ఆదిలక్ష్మిని తనతో ఊరికి పంపాలని వెంకటేశ్వర్లు మేనమామతో ఘర్షణకు దిగాడు. అప్పటినుంచి భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తామామలను అడగ్గా వారు మద్యం మానేసి వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అలిగి వేపినాపికి వెళ్లిపోయాడు. భార్యను కాపురానికి తీసుకెళ్లాలంటే మేనమామ శ్రీనివాసులు అడ్డుగా ఉన్నాడని భావించాడు. దీంతో ఆయన్ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈక్రమంలో వెంకటేశ్వర్లు భార్య ఇంటికి వచ్చి మద్యం తాగడం మానేశాని చెప్పి అక్కడే ఉన్నాడు. పనినిమిత్తం అని చెప్పి నాయుడుపేటకు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. దీంతో అల్లుడు మారిపోయాడని అత్తామామ, భార్య నమ్మారు.
ఆరుబయట నిద్రిస్తుండగా..
సోమవారం అర్ధరాత్రి రత్నమ్మ, ఆదిలక్ష్మి, ఆమె పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఆరుబయట పడుకున్నారు. ఇదే అదనుగా భావించిన వెంకటేశ్వర్లు కట్టెలు కొట్టే గొడ్డలితో మేనమామ మెడ, ఎడమకాలుపై నరికి పరారైయ్యాడు. తీవ్ర రక్తస్రావమై శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదిలక్ష్మి కుమారుడు శ్రీధర్ మరుగుదొడ్డికి వెళ్లేందుకు తలుపు తీశాడు. ఈక్రమంలో నెత్తుటిమడుగులో ఉన్న తాతను చూసి కేకలు వేశాడు. బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వాకాడు సీఐ నరసింహారావు, ఎస్సై నరహరిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం చేయించారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment