1902–03లో గోల్కొండ కోట
ఐటీలో మేటి.. ఫార్మాలో ప్రపంచ ఖ్యాతి.. వీటన్నింటికీ తోడు ఇప్పుడు మెట్రో సొబగులు.. వెరసి వడివడిగా విశ్వనగరం దిశగా అడుగులు.. ఇది నేటి హైదరాబాద్! మరి వందల ఏళ్ల కిందట నగరం ఎలా ఉండేది? ఈ మహానగర నిర్మాణానికి ప్లానింగ్ ఎలా చేశారు? సిటీలో మొట్టమొదట దేన్ని నిర్మించారు? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ఆనాడే ఎలా రూపకల్పన చేశారు? ఈనాడు కాదు.. వీటన్నింటికీ ఐదు వందల ఏళ్ల కిందటే బీజం పడింది. అదే ఇప్పుడు మహా వృక్షమై, మహానగరమై వెలుగుతోంది. శతాబ్దాల నగర నిర్మాణ ప్రస్థానంపై ఈ వారం ఫోకస్..
– ముహ్మద్ మంజూర్
కుతుబ్ షాహీల పాలనలో..
16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ సంస్థాన స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా తుర్క్‌మనిస్తాన్ నుంచి కుటుంబ సమేతంగా భారత్ వచ్చారు. తొలుత ఢిల్లీ వెళ్లిన కులీ కుతుబ్ షా ఆ తర్వాత బీదర్ వచ్చి బహమనీ సంస్థానంలోని సైన్యంలో చేరాడు. ఈ క్రమంలో గోల్కొండ పాలకుడిగా ఉన్న మహమూద్ బహమనీ నమ్మకాన్ని పొందాడు. దీంతో మహమూద్ బహమనీ కులీ కుతుబ్ షాకు గోల్కొండ కోట సుబేదారుగా బాధ్యతలు అప్పగించి గోల్కొండకు పంపాడు. అనంతరం బహమనీల పతనం ప్రారంభం కావడంతో 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను తన అధీనంలోకి తీసుకుని పరిపాలన ప్రారంభించాడు. 1543లో జంషీద్ చేతిలోనే కులీ కుతుబ్ షా హత్యకు గురయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా ఏడేళ్లు.. అతడి కుమారుడు సుభాన్ కులీ కొన్ని నెలలు సంస్థానాన్ని పాలించారు. అయితే సుభాన్ చిన్న వయసు వాడు కావడంతో ప్రజలు, సంస్థాన పాలకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయనగరంలో ఉన్న సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను సంస్థాన బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దీంతో 1550లో ఇబ్రహీం కులీ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాడు.
కొత్త నగరానికి శ్రీకారం..
ఇబ్రహీం తండ్రి హయాంలో దేవరకొండ సుబేదార్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం విజయనగరం వెళ్లి పరిపాలనా నైపుణ్యంతో పాటు వివిధ సంస్థానాల పాలనను అధ్యయనం చేశాడు. గోల్కొండకు రాజయ్యాక.. కోటతోపాటు సంస్థానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టాడు. గోల్కొండ కోటలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగింది. కోట లోపల ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. వెయ్యేళ్ల క్రితం అప్పటి అవసరాలకు, జనాభాకు సరిపడేలా మట్టితో గోల్కొండ కోటను కట్టారు. దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కోట బయట ఓ కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు. నూతన నగరం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని సంస్థానం అధికారులకు సూచించాడు. మూసీ దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు. తొలుత మూసీ నదిపై వంతెన నిర్మించాలని అధికారులు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను కోరారు. దీంతో 1578లో మూసీ నదిపై పురానాపూల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది.
నగర మాస్టర్‌ప్లాన్ రూపకర్త మీర్ మొమిన్
చార్మినార్‌తో పాటు నూతన నగర నిర్మాణానికి ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ కోసం పలు సంస్థానాలు, దేశాల్లో ఆరా తీశారు. ఇరాన్‌లోని ఇస్తారాబాద్‌లో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్‌ను సంప్రదించారు. చార్మినార్‌తోపాటు నగర నిర్మాణానికి తన సేవలు అందిస్తానని ఆయన ఒప్పుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా గోల్కొండకు వచ్చి మహ్మద్ కులీని కలిశారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన మహ్మద్ కులీ ప్రధానమంత్రిగా నియమించారు. చార్మినార్, నగర నిర్మాణ బా«ధ్యతలు సైతం అప్పగించారు. దీంతో మీర్ మొమిన్ మూడేళ్లు శ్రమించి చార్మినార్ నిర్మాణానికి పలు డిజైన్లు రూపొందించి రాజుకు చూపించాడు. వాటిని పరిశీలించిన రాజు ఎన్నో మార్పులు సూచించారు. అంతే కాదు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండేలా నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో ఇరాక్‌లో ఉన్న ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగా నాలుగు మీనార్‌లు ఉండేలా చార్మినార్, ఇరాన్‌లోని ఇస్వాహాన్ మాదిరిగా నగరం నిర్మాణానికి ప్రణాళికలు రచించారు.
చార్మినార్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే సుస్థిరంగా ఉంటుందో తెలుసుకునేందుకు పలు భూగర్భ పరీక్షలు చేశారు. మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలను తవ్వి అక్కడి నేలనూ పరీక్షించారు. గోల్కొండ నుంచి ముసొలి పట్నం(మచిలీపట్నం) వెళ్లే మార్గంలో తూర్పు నుంచి పడమరకు 90 డిగ్రీల యాంగిల్‌లో ఉత్తరం దక్షిణాన్ని కలిపేలా చార్మినార్ నిర్మించాలని నిర్ణయించారు. చార్మినార్‌కు నాలుగు వైపులా వెడల్పైన రోడ్డు ఉండేలా ప్రణాళికలు చేశారు. చార్మినార్‌కు పడమర వైపు బజార్ ఏర్పాటు చేయాలని, ఉత్తర దిశలో 100 మీటర్ల ముందు చార్‌సూహౌస్(నేడు గుల్జార్‌హౌస్) నిర్మించాలని నిర్ణయించారు. దానికి నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించాలని ప్లాన్ వేశారు. ఈ నాలుగు కమాన్‌ల నుంచి నాలుగు రోడ్లు నాలుగు దిక్కులా నగరంలోకి వెళ్లేలా మార్గాలు వేయాలని, కమాన్‌ల పడమర వైపు రాజమహల్ నిర్మించాలని, తూర్పు వైపు ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. చార్మినార్‌ను కేంద్రంగా చేస్తూ నగరం అంతా ఐదు మైళ్లు ఉండేలా నాలుగు వైపులా రోడ్డు ఏర్పాటు చేయాలని, నగర ప్రధాన రోడ్లు 100–120 అడుగులు, అంతర్గత రోడ్లు 50–60 అడుగులు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతి ఇంటి ముందు, వెనుక ఖాళీ ప్రదేశం ఉండేలా ఇళ్ల నిర్మాణం.. నీటి అవసరాలకు బావి ఉండాలని ప్రణాళిక వేశారు.
తొలి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్
గోల్కొండ కోటకు దుర్గం చెరువు నుంచి నీటి సరఫరా వ్యవస్థ ఉంది. చార్మినార్‌పై ఓ పెద్ద హౌస్ ఉండేది. జల్‌పల్లి చెరువు నుంచి భూగర్భ పైప్‌లైన్ ద్వారా టొపోగ్రఫీ పద్ధతిలో చార్మినార్‌పై ఉన్న హౌస్‌లో నీళ్లు వచ్చేవి. చార్మినార్ పైకి వెళ్లే వారికి అక్కడ నీటి అవసరాల కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నేటికీ చార్మినార్ పైన చూస్తే నాటి పైప్‌లైన్‌ల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక ప్రతి ఇంట్లో బావులు ఉండేవి. నగర ప్రజలందరు బావి నీరే తాగే వారు. ఆ రోజుల్లో ధనవంతులు పుణ్యకార్యంగా భావించి ప్రజల సౌకర్యార్థం బావులు తవ్వించే వారు. బావులు లేని ప్రజలు వీటిని ఉపయోగించే వారు. నీటి సమస్య ఉంటే ఆ ప్రదేశాల్లో ప్రభుత్వమే బావులు తవ్వించింది. నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాటసారుల సౌకర్యార్థం కార్వన్ సరాయితో పాటు మసీదులు, దేవాలయాల్లో విశ్రాంతి గదులు నిర్మించారు.
మూసీ పక్కనే ఎందుకు..
మూసీ నది పక్కనే నగరం నిర్మించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. నది ఓడ్డున ఎత్తైన, గట్టి భూమి ఉండటం ఒక కారణమైతే.. నగరంలో భూగర్భ నీటి మట్టం ఎక్కువగా ఉండాలని భావించడం మరో కారణం. నగర ప్రజలు ఇళ్లలో బావులు తవ్వితే తక్కువ లోతులోనే నీళ్లు అందుబాటులోకి రావాలని, మట్టం తక్కువగా ఉండాలని మూసీ పక్కనే నగర నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అలాగే నది పక్కన ఉంటే కాలుష్య రహితంగా నగర వాతావరణం ఉంటుందని ఈ దిశగా నగర నిర్మాణం చేపట్టారు.
నాటి గొల్లకొండే..నేటి గోల్కొండ..
గోల్కొండ కోట చరిత్ర వెయ్యేళ్ల కంటే ఎక్కువే. ఈ కోట నుంచే కాకతీయుల పాలన సాగింది. అనంతరం తుగ్లక్ వంశం ఢిల్లీ నుంచి పాలించింది. ఆ తర్వాత బహమనీ సుల్తాన్ పరిపాలనలోకి వచ్చింది. కాకతీయుల కాలం నుంచి ఈ కోట మట్టి కోటగానే ఉంది. మొదట్లో ఈ కోటను గొల్లకొండ అనే వారు. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా.. సారవంతమైన నేలతో ఎటుచూసినా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేది. ఈ ప్రదేశంలో ఎక్కువగా గొల్లవారు నివసించేవారు. కోట చుట్టూ ఉన్న ప్రాంతంలో కాపరులు పశువులను మేత కోసం ఇక్కడికే తీసుకొచ్చేవారు. దీంతో గొల్లకొండగా పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా గోల్కొండగా మారింది.
నగర ఏర్పాటు నుంచే మురికి నీటికి భూగర్భ వ్యవస్థ
ఇరాన్‌లోని ఇస్వాహాన్ నమూనాలో నగర ఏర్పాటుకు ప్రణాళికలు వేశారు. అక్కడి మాదిరే నగరంలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటి కోసం అంతర్గత మోరీలు నిర్మించారు. నగరంలోని మట్టి రోడ్లపై దుమ్మూధూళీ రేగకుండా రోజుకు ఒకసారి నీళ్లు చల్లాలని.. రాజమహల్ నుంచి వచ్చే నీరు భూఅంతర్భాగం నుంచి వెళ్లేలా మట్టి పైపులు అమర్చాలని ప్లాన్ చేశారు. పాలకులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులకు మాత్రమే రెండు, మూడు అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఉండేవి. నగర ప్రజల అవసరాల కోసం మూసీ నది ఓడ్డున విశాలమైన ప్రదేశంలో దారుషిఫా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. మసీదులు, దేవాలయాల్లో విద్యాబోధన, ప్రతి వీధిలో మలుపు వద్ద ఎత్తయిన స్తంభాలు ఏర్పాటు చేసి వాటిపై రాత్రి పూట కాగడాలు అమర్చాలని నిర్ణయించారు. నగర ఐదు మైళ్ల సరిహద్దులో దాదాపు 1,200 మహళ్లు, 14,000 ఇళ్లు, దుకాణాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పటికీ నగర రోడ్లు, వీధులు ఉండటం గమనార్హం.
నగర నిర్మాణానికి ముందే 5 వేల మొక్కలు
మీర్ మొమిన్ నగర ప్లాన్‌లో భాగంగా ఏ ప్రదేశాల్లోనైతే రోడ్లు, విశాలమైన ప్రదేశాలు ఉంచాలని నిర్ణయించారో ఆ ప్రదేశాలతో పాటు చార్మినార్, గుల్జార్ హౌస్ నుంచి నాలుగు వైపులా వెళ్లే అన్ని మార్గాల ఇరు పక్కలా చెట్లు నాటారు. మహల్, భవనాల ముందు వెనుక, ఇళ్ల ముందు వెనుక, ప్రతి మసీదు, దేవాలయం, సరాయి లోపలా బయటా చెట్లు నాటారు. నగరంలో సారవంతమైన(మొక్కలు ఎదగడానికి దోహదపడే) భూమిని ఎంపిక చేసి అందులో ప్రజల అవసరాల కోసం ఐదు వేల ఔషధ మొక్కలను పెంచారు. మూసీ ఒడ్డున పచ్చదనం కోసం పెద్ద పెద్ద చెట్ల మొక్కలను నాటారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరు పక్కలా నిడనిచ్చే పెద్ద చెట్ల మొక్కలను నాటారు. దీంతో నగరం ఏర్పాటుతోనే గ్రీన్ సిటీగా పిలిచేవారు. నగరంలో ఆ రోజుల్లో దాదాపు 10 వరకు పార్కులు ఉండేవి.
తొలి మాస్టర్ ప్లాన్.. పురానాపూల్
పురానాపూల్ వంతెన
పురానాపూల్ వంతెన నిర్మాణాన్ని హైదరాబాద్ ఏర్పాటులో తొలి మాస్టర్ ప్లాన్‌గా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే పురానాపూల్ నిర్మాణంతోనే గోల్కొండ కోట నుంచి మూసీ నది దాటి వేరే ప్రదేశానికి వచ్చే మార్గం ఏర్పాటైంది. పారిస్‌లోని సైనీ నది మీద నిర్మించిన పాంట్ మేరీ వంతెన మాదిరిగా పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురానాపూల్ వంతెనను ఆర్చ్‌లతో నిర్మించారు. పురానాపూల్ నిర్మాణం అనంతరం కోట నుంచి పలువురు సంస్థాన ఉన్నతాధికారులు తమ నివాసాలను మూసీ దక్షిణ భాగంలో కొత్త నగర నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతానికి మార్చారు. రాజు అనుమతి తీసుకుని మూడు, నాలుగు భవంతులను ఆ ప్రాంతంలో నిర్మించారు. 1580లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించాడు. అనంతరం ఆయన కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సంస్థాన పాలకుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటికి గోల్కొండ కోట జనంతో ఇరుకైపోయింది. జనాభా విపరీతంగా పెరగడంతో రోగాలు విజృంభించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తండ్రి కోరిక మేరకు మూసీ దక్షిణాన నగరం నిర్మించాలని మహ్మద్ కులీ అధికారులను ఆదేశించాడు.
చార్మినార్‌కు పడమర వైపు రాజమహళ్లు
నగరాభివృద్ధికి ముందు చార్మినార్ ప్రాంతం
చార్మినార్ ముందు గుల్జార్‌హౌస్‌కు పడమర వైపు రాజుతో పాటు సంస్థాన ఉన్నతాధికారుల కోసం దాద్ మహల్, కుదాదాద్ మహల్, సాజన్ మహల్, లాఖా మహల్, నాది మహల్ ఇలా రాజమహళ్లు నిర్మించారు. కుదాదాద్ మహల్ ఏడు అంతస్తులతో నిర్మించారు. ఆ రోజుల్లో అదే అతి ఎౖతయిన మహల్. మీర్ మొమిన్ ఇరాన్ దేశస్తుడు. ఆ రోజుల్లో ఇరాన్ ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా చలామణి అయింది. అక్కడి భవన నిర్మాణ శైలి ఆ రోజుల్లోనే అధునాతన శైలి. అందువల్ల హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని మహళ్లు, భవనాలు, మసీదులు ఇరాన్ స్టైల్‌లో నిర్మించారు.
తొలి పర్యాటక ప్రదేశం
చార్మినార్ నుంచి దక్షిణం వైపు వెళ్లే మార్గంలో 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన కొండ కొహెతూర్ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఈ కొండపై రెండు విశాలమైన సారవంతమైన చబుత్రా మాదిరి ప్రదేశాలు ఉండేవి. ఇక్కడ మొక్కలు, చెట్లను నాటడంతో ఈ కొండ మొత్తం ఒక ఉద్యాన వనంగా మారింది. ఆ కొండే ఇప్పటి ఫలక్‌నుమా ప్యాలెస్. ఈ కొండపైకి రాజుతోపాటు ఉన్నతాధికారులు వెళ్లేవారు. గోల్కొండ కోట నుంచి ఈ కొండ నుంచి నగరం అంతా ఏరియల్ వ్యూ మాదిరిగా కనిపించేది.
ఇప్పటికీ అదే మాస్టర్ ప్లాన్..
1887లో హైదరాబాద్ విస్తీర్ణం, 1959లో హైదరాబాద్ విస్తీర్ణం
నగర ఏర్పాటు సమయంలో చేసిన మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ప్రధాన రోడ్లు, వీధులతో పాటు భవన నిర్మాణ శైలి ఉండేది. కుతుబ్ షాహీల పాలనతో పాటు ఆసిఫ్ జాహీ పాలనా కాలం రెండో నిజాం పాలనా కాలం వరకు అదే కొనసాగింది. కుతుబ్ షాహీలు ఏర్పాటు చేసిన నగర పరిధిని 5 మైళ్ల నుంచి 10 మైళ్ల వరకు రెండో నిజాం అలీఖాన్ హయాంలో పెంచారు. నగరం చుట్టూ 12 దర్వాజాలు(తలుపులు), 12 కిటికీలు ఏర్పాటు చేశారు. మళ్లీ నగర మాస్టర్ ప్లాన్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో ప్రారంభమైంది. కానీ ఆయన కొద్ది రోజుల్లోనే మరణించారు. అనంతరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ హయాంలో హైదరాబాద్ నగర పునర్ నిర్మాణం జరిగింది. ఇలా నగర ఏర్పాటు సమయంలో సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్ ఏడో నిజాం హయాం వరకు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment