సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలోని వైవిధ్యమే భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకమని వివిధ భాషలు, సంస్కృతులు, ఆచారాలు, జీవన విధానాలను పరిరక్షించడంలోనే ఏకత్వం ఇమిడి ఉందని నల్సార్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే భావన రాజ్యాంగ విరుద్ధమైనదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాహితీ ఉత్సవం రెండో రోజైన శనివారం నిర్వహించిన ‘డైవర్సిటీ అండ్ ద ఇండియన్ కాన్‌స్టిట్యూషన్’ అనే అంశంపైన ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పీఠికలోనే ‘భారత ప్రజలమైన మేము..’ అనే సంబోధన ఉంటుందని, అది విభిన్న వర్గాల ప్రజల సమష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
ఇప్పటి వరకు ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ మినహా భారత ప్రధానులంతా ఆ స్ఫూర్తినే కొనసాగించారన్నారు. మతం ప్రాతిపదికన మెజారిటీ, మైనారిటీ నిర్వచించడం సరైంది కాదని, స్థానిక పరిస్థితులు, భాషను ఇందుకు ప్రామాణికంగా భావించాలని పేర్కొన్నారు. దేశంలో హిందూ మతం మెజారిటీ అని, మిగతావి మైనారిటీవని చెప్పేందుకు అవకాశం లేదన్నారు. పంజాబ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ వర్గాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మైనారిటీ వర్గాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
పార్లమెంట్ ఉభయ సభలు అత్యధిక మెజారిటీతో ఆమోదించినంత మాత్రాన కొలీజియంపై సుప్రీంకోర్టు తీర్పే అంతిమమైందని, అలాగే అగ్రకుల పేదల రిజర్వేషన్‌ల విషయంలోనూ మెజారిటీ పార్లమెంట్ సభ్యుల ఆమోదమే ప్రామాణికం కాకపోవచ్చునన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. దళితులు, ముస్లింలు,ఆదివాసీలు, తదితర వర్గాలపైన జరుగుతున్న దాడులు, వారి జీవన విధానాలను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీ మార్గమే అనుసరణీయం.....
గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘గుజరాత్ సాహిత్యం– గాంధీజీ తులనాత్మక అధ్యయనం’పై జరిగిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడారు.నేటికీ గాంధీజీ మార్గమే అనుసరణీయమని, జయాపజయాలు అనే కోణంలో దాన్ని అర్థంచేసుకోవడం సరైంది కాదన్నారు. గుజరాతీ రచయిత సితాన్షు యశస్‌చంద్ర మాట్లాడుతూ, ‘నా తల్లి స్తన్యమిస్తూ చెప్పిన పలుకులు గుర్తు లేవు, కానీ ఆ పలుకులను ఆమె ఏ భాషలో పలికిందో ఆ భాష... పాలతోపాటే నా ఒంట్లోకి ప్రవహించింది. భావాన్ని యధాతధంగా వ్యక్తం చేయగలిగేది తల్లి భాషలోనే’అని చెప్పిన గాంధీ మాటలను గుర్తు చేశారు.
‘సమాజం మారాలని చూడవద్దు, మనిషి ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా నిన్ను నువ్వు మార్చుకుంటే సమాజం నువ్వనుకున్నట్లే మారుతుంది’అని గాంధీజీ చెప్పిన విషయాన్ని... ‘నీటి బిందువులు మారితే సముద్రం కూడా మారిపోతుంది’‘గాంధీ, యాన్ ఇంపాజిబుల్ పాజిబులిటీ’ అంశం మీద సుధీర్ చంద్ర ప్రసంగించారు. ప్రణయ్ లాల్ రాసిన ‘ఇండియా, ఎ డీప్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్’పుస్తకం మీద చర్చాగోష్టి జరిగింది. ‘కాంటెంపరరీ కరెంట్స్ ఇన్ గుజరాతీ లిటరేచర్’ అంశం మీద సాగిన చర్చలో గుజరాతీ సాహిత్యంలో చోటు చేసుకున్న మార్పులను ప్రస్తావించారు.
హింసకు కూడా ఓ మానవీయ కోణం
రచయితలు, కళాకారుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో పాల్గొంటున్నది సామాజికంగా కింది స్థాయిలోనివాళ్లే కావడాన్ని మానవీయ కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు ‘ఆర్ట్ ఎటాక్స్’ పుస్తక రచయిత్రి ప్రొఫెసర్ మాళవిక మహేశ్వరి. ‘కళ, ఆదర్శవాదం’ అంశం మీద జరిగిన చర్చలో ఆమె సీని యర్ పాత్రికేయుడు సలీల్ త్రిపాఠితో కలిసి పాల్గొన్నారు. చందనా చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. వెనకవుండి దాడులను ప్రోత్సహించేది ఎవరైనా, జీవితంలోని నిరాశ వల్ల ‘ఏదో సాధించిన తృప్తి’కోసం పేదవాళ్లు ఈ హింసలో పాల్గొంటున్నారని మాళవిక చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి.
మనోభావాలు గాయపడటం అనే కోణాన్ని స్పృశిస్తూ– స్వేచ్ఛకు పరిమితులు విధించినట్టుగా కనబడే రాజ్యాంగం, నిజానికి అప్పటి కాలాన్ని ప్రతిబింబించడంతోపాటు ప్రజలను ఉదారవాదులుగా పరిణామం చెందించే పాత్ర కూడా పోషిస్తోందనీ, అందువల్ల ప్రజాస్వామ్యానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. మృణాళిని సారాభాయి శత జయంతి సందర్భంగా ఆమె కుమార్తె మల్లికాసారాభాయి నివాళులర్పించారు. రెండో రోజు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మోహన్ భగవత్ తర్వాతి ప్రధాని?
ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తెరమీదకు వచ్చే అవకాశముం దని సీనియర్ పాత్రికేయుడు కింగ్‌షుక్ నాగ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స్పష్టమైన మెజారిటీæ గెలుచుకుంటే సహజంగా మోదీయే అభ్యర్థిగా ఉంటారు. కానీ 150–160 సీట్లు మించి బీజేపీ గెలవకపోతే మాత్రం భగవత్ కూడా బరిలోకి దిగవచ్చన్నారు. ‘ద చీఫ్ అండ్ ద చీఫ్ మినిస్టర్’ చర్చాకార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు యూపీఏ అభ్యర్థిగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రధాని పదవికి పోటీపడే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవచ్చన్నారు.
మమతా బెనర్జీ జీవిత కథ ‘దీదీ.. అన్‌టోల్డ్ స్టోరీ’ రాసిన పాత్రికేయురాలు శుతాపా పాల్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి మరో పాత్రికేయురాలు ఉమా సుధీర్ సమన్వయకర్తగా వ్యవహరించా రు. ప్రణబ్ ముఖర్జీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ‘క్విడ్ ప్రో కో’ చర్యనా అన్న ప్రశ్నకు.. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకు ని చేసిన చర్యగా ప్యానెల్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment