రియల్టీలో నంబర్‌వన్‌గా హైదరాబాద్
♦ ఆ దిశగా నిర్మాణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు
♦ మార్చి తర్వాత నగరంలో రియల్‘బూమ్’
♦ రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్ ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: ఐటీతో పాటు నిర్మాణ, స్థిరాస్థి రంగాల్లోనూ హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్థిరాస్తి, నిర్మాణ రంగాల అభివృద్ధి కోసం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మార్చి తర్వాత హైదరాబాద్‌లో రియల్ బూమ్ మరింత ఊపందుకుంటుందని జోస్యం చెప్పారు. నిర్మాణ రంగానికి చెందిన నాలుగు సంస్థలు సంయుక్తంగా మంగళవారం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘రియల్ ఎస్టేట్ సమ్మిట్’లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దశాబ్దకాలంగా నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న 40 సమస్యల్లో 31 సమస్యలను ఏకకాలంలో పరిష్కరించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
‘‘అవినీతికి తావులే కుండా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డింగ్ పర్మిషన్లు, లే అవుట్ల అనుమతులు నిర్దేశిత సమయంలో లభించేలా టీఎస్ ఐపాస్ తరహాలో ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తాం. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లుగానే పరిగణించేలా చర్యలు చేపడతాం. బాధ్యులైన అధికారులకు గడువు తర్వాత రోజుకు రూ.500 చొప్పున జరిమా నా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ కంపెనీలు జాతీయ స్థాయిలో పోటీలో నిలదొక్కుకునేలా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం. హైదరాబాద్‌లో సగటు మనిషి ప్రధానంగా రహదారులు, నిరంతర విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కోరుకుంటారు. ఇవన్నీ కల్పించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు’’ అని వివరించారు.
అపోహలు తొలగిపోయాయ్..
తెలంగాణ ఏర్పడక ముందు నగర ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు నెలకొన్నాయని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులతో పాటు ఇతర రాష్ట్రాల వారిని కట్టుబట్టలతో పంపేస్తారని నాడు ప్రచారం జరిగింది. గత 19 నెలల్లో ఏ ఒక్కరికీ శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందుకోసం పోలీసులకు రూ.350 కోట్లతో అధునాతన వాహనాలను సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే.
ప్రత్యేక రాష్ట్రంలో కరెంటుండదని, చిమ్మచీకట్లు అలముకుంటాయని అపోహలొచ్చాయి. కానీ సీఎం కృషి ఫలితంగా నగరవాసులకు ప్రస్తుతం నిరంతర విద్యుత్ అందుతోంది. రాష్ట్రం విడిపోతే పెట్టుబడులు రావనీ సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం తెచ్చిన టీఎస్‌ఐపాస్‌తో గత 8 నెలల్లో ఏకంగా 1,000 కంపెనీలకు అనుమతులిచ్చాం. రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ఆయా కంపెనీల్లో దాదాపు లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
హైదరాబాద్ జనాభా ఏకంగా 10 కోట్లు దాటినా తాగునీటి ఇబ్బందులు ఉండకుండా శామీర్‌పేట్, రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంతాల్లో రూ.7,600 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నాం. నగరంలో 55 జంక్షన్లను ఆధునీకరిస్తున్నాం. రూ.11 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేలు, మూసీ తీరం వెంబడి 8 వేల కోట్లతో 42 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు. గతేడాది నగరంలో కమర్షియల్ స్పేస్ పెరిగినంతగా గృహ నిర్మాణం పెరగలేదన్నారు.
అయినా దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో జీవన వ్యయం అత్యంత తక్కువన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ అధ్యక్షుడు రామిరెడ్డి, బీడీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ట్రెడా అధ్యక్షుడు దశరథరెడ్డి, టీబీఏ అధ్యక్షుడు జీవీ రావు, నెరెడ్‌కో అధ్యక్షుడు చలపతిరావు, ప్రదీప్ కన్సట్రక్షన్స్ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రకాశ్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.