
భూ కబ్జా కేసులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్టు
♦ సూత్రధారి న్యాయవాది శైలేష్ సక్సేనా సైతం కటకటాల్లోకి
♦ నిందితుడు శివభూషణం విచారణలో వివరాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది... మరో రాజకీయ ‘సంబంధీకుడు’... కొందరు బోగస్ వ్యక్తులు... అంతా కలిసి కుట్రతో చేసిన కబ్జా లు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను వీరు కైకర్యం చేయడానికి భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్‌డీడ్లు తయారు చేయించారు.
ఈ వ్యవహారాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. గత నెలలో సీసీఎస్ పోలీసులకు చిక్కిన వీరి అనుచరుడు మావూరి శివభూషణం విచారణ లో న్యాయవాది శైలేష్ సక్సేనతో పాటు తెలు గుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి లీలలు వెలుగు లోకి వచ్చాయి. అనంతపురం జిల్లా రాయ దుర్గంకు చెందిన ఈయన ఆ జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడ నే విషయం విదితమే.
అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురా న్యాయవాది శైలేష్ సక్సేనాతో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైన ప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తా ను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు.
ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు అతడి పిల్లల వివాహాలకు అవసరమైన సహాయం చేస్తానంటూ శైలేష్ ఒప్పందం కుదుర్చుకు న్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్ల ఖరీదైన 78 ఎకరాల 2 గుంటల స్థలంపై శైలేష్ కన్నేశాడు. స్థల యజమాని ఇక్బాల్ ఇస్లాంఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశా డు. ఇక్బాల్‌గా నటించేందుకు శివభూషణంను ఒప్పించి, బోగస్ పత్రా ల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలంపై శైలేష్ పిటిషన్ వేశాడు. శివభూషణాన్ని కోర్టులో ఇక్బాల్‌గా చూపాడు. వాయిదాలకు వెళ్లినప్పుడల్లా అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు జి.దీపక్ రెడ్డి ఉండేవారు.
దీపక్‌రెడ్డిపై గతంలోనూ కేసులు...
వీరి వ్యవహారాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులో దీపక్‌రెడ్డి, శైలే ష్ సక్సేనా ముందస్తు బెయిల్స్ పొందారు. మిగిలిన కేసుల్లో ఒకదాంట్లో ఆధారాలు సేక రించిన సీసీఎస్ పోలీసులు మంగళవారం ముగ్గురినీ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ దీపక్‌రె డ్డిపై మాదాపూర్ ఠాణాలో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌పై దాడికి యత్నించిన కేసు సైతం ఉన్నాయి.
నకిలీ ఓటర్ ఐడీతో మరో దందా...
ఒక్కో వాయిదాకు హాజరైనందుకు శైలేష్ రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. గుడిమల్కాపూర్‌తోపాటు మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. శైలేష్, జి.దీపక్‌రెడ్డిలు శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించి, బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’దాన్ని వాడారు. హైదరాబాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా... ఖరీదు చేస్తున్నట్లు జి.దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేష్ సక్సేనా రూ.1,000 శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించిన శైలేష్... దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించాడు.