
‘నాకు కొమ్ములు మొలవలే... నేను పాత కేసీఆర్‌నే’
ఉద్యమాల్లో పాల్గొన్న అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యంకాకపోయినా, చాలామందికి పదవులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ‘నేను పాత కేసీఆర్‌నే. ముఖ్యమంత్రి కాగానే నాకేం ఎక్కువ పెద్దిరికం రాలేదు. కొమ్ములు మొలువలేదు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీకోసం కష్టపడిన ప్రతీవారూ నాకు గుర్తున్నరు. మహిళల్లో ఎవరు కష్టపడ్డారో, మైనారిటీల్లో ఎవరు త్యాగాలు చేశారో ప్రతీ గ్రామం, నగరం, పట్టణం, జిల్లాల వారీగా అందరిలిస్టు నా దగ్గర ఉంది.
ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. ప్రభుత్వంలో ఎన్నో పదవులున్నయి. ఉద్యమంలో ఉన్నవారందరికీ పదవులు రాకపోయినా చాలామందికి వస్తయి. ఎవరూ నిరాశ పడవద్దు’ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఇప్పుడున్న సమావేశం హాలును అద్దాలతో నిర్మిస్తామన్నారు. పక్కనే మరో భవనం కట్టి అందులో నిరంతర శిక్షణా శిబిరాలు, కింద డైనింగు హాలు కడతామన్నారు. దానికి ఆచార్య జయశంకర్ పేరు పెడతామన్నారు.