ఇటుక దందా..ఇష్టారాజ్యం | Illegal Bricks Mafia In Nizamabad | Sakshi
Sakshi News home page

ఇటుక దందా..ఇష్టారాజ్యం

Published Fri, Feb 1 2019 8:08 AM | Last Updated on Fri, Feb 1 2019 8:08 AM

Illegal Bricks Mafia In Nizamabad - Sakshi

బాన్సువాడ టౌన్‌: చట్టాలు ఎన్ని వచ్చినా అక్రమార్కులకు చుట్టాలుగానే మారుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో అవినీతి పరుల ఆగడాలు ‘మూడు ఇటుకలు.. ఆరు బట్టీలు’గా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇటుక బట్టీలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటుకను కాల్చడానికి అడవి కలపను, బొగ్గును వాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, దేశాయిపేట్‌ గ్రామాల సమీపంలో ఇటుక బట్టీలను నడిపించడం మొదలు పెట్టారు. వీటి ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదారేళ్ల నుంచి ఆయా గ్రామాల్లో యథేచ్ఛగా ఇటుక బట్టీలను కొనసాగిస్తున్నారు.

గ్రామాల్లో రెండు, మూడు చోట్ల ఇటుక దందా జోరుగా నడుస్తోంది. ఇటుక కాల్చడానికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలపను తీసుకొచ్చి కాల్చుతున్నారు. అలాగే నల్లబొగ్గును కూడా వాడుతున్నారు. అటు వైపు రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీల వ్యాపారుల నుంచి మామూళ్లు అందడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ అడవి నుంచి ట్రాక్టర్లలో కలపను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్‌కు రూ.2వేల వరకు ఇటుక బట్టీల వారు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా వ్యాపారం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. బోర్లం గ్రామ సమీపంలో నిర్వహించే ఇటుక బట్టీలవారు పక్కనే అడవి ప్రాంతం నుంచి కలప వాడుతున్నారు. ఫారెస్ట్‌ అధికారులు తమకేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

పచ్చని పొలాల్లో... 
భూ పరిరక్షణ చట్టం 129/12 లో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహించాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా పంట భూముల్లోనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. మండల కేంద్రానికి కూత వేటులో దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యారు. ఆయా పంచాయతీల పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలు నష్టపోతున్నాయి. ఇదిలా ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూముల్లో సైతం ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇటుక బట్టీల వ్యాపారులు అటువైపు నుంచి ప్రవాహిస్తున్న వాగుల్లోనే అయిల్‌ ఇంజన్లు, విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు మాత్రం కిమ్మనడంలేదు.

వ్యాపారులదే హవా... 
ఇటుక బట్టీల నిర్వాహకులు అనుమతులు లేకుండా ఇటుక బట్టీలను నడిపిస్తున్నారు. ఇటుక బట్టీలకు అనుమతి లేకుండానే విద్యుత్‌ చౌర్యం, అడవి నుంచి కలప అక్రమ రవాణా అధికారులు పట్టించుకోకపోవం మూలంగా వారు ఇష్టారాజ్యంగా దందాను కొనసాగిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పూర్తి వివరాలు తెలుసుకుంటాం 
తమ పరిధిలోని ఏ ప్రాంతంలో అయినా ఇటుక బట్టీలు ఎక్కడెక్కడ ఎన్నాయో తెలుసుకుంటాం. అనుమతులు తీసుకున్న విషయం తెలియదు. పూర్తి సమాచారం తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.  
–సుదర్శన్, తహసీల్దార్, బాన్సువాడ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement