
బాలానగర్ : అక్రమంగా తరలిస్తున్న రాయితీ గొర్రెలను ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు లారీల్లో ప్రభుత్వం రాయితీపై అందించిన గొర్రెలను చౌకగా కొనుగోలు చేసి ఏపీలోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని పలు పట్టణాలకు తరలిస్తున్నారు. ఇలా రెండు లారీల్లో కొందరు 648 గొర్రెలను తరలిస్తుండగా రైతు అవగాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య యాదవ్ ఇతర నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలానగర్ పశువైద్య అధికారి రఘు విచారణ జరిపారు. లారీల్లో తరలిస్తున్న మొత్తం 648 గొర్రెల్లో 130 గొర్రెలను ప్రభుత్వం లబ్ధిదారులకు రాయితీపై అందించినవిగా గుర్తించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో గొర్రెను రూ.3,200 కొనుగోలుచేసి రూ.3,800 నుంచి నాలుగు వేల వరకు విక్రయిస్తారని విచారణలో తేలిందని ఆయన చెప్పారు. లారీలను స్వాధీనం చేసుకుని, గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment