మాతృభాషపై ఆసక్తి పెంచుకోవాలి | Increase interest in Mother language | Sakshi
Sakshi News home page

మాతృభాషపై ఆసక్తి పెంచుకోవాలి

Published Tue, Dec 16 2014 2:40 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

Increase interest in Mother language

నార్నూర్ : మాతృభాషపై ఆసక్తి పెంచుకున్నప్పుడే గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నార్నూర్ మండలంలోని గుం జాల గ్రామంలో సోమవారం ‘గుంజాల గోండి లిపి-సంపూర్ణ అక్షరాస్యత గ్రామం గా గుంజాల’ అనే కార్యక్రమ ప్రారంభ సభను నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు గ్రామంలోని కొమురం భీమ్ జెండా వద్ద నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల పాటు కనుమరుగైన గుంజాల గోండి లిపి ప్రతులను వెలుగులోకి తీసుకువచ్చిన జంగు, లింగులను, గోండి లిపిని అధ్యయనం చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రొఫెసర్‌లను అభినందించారు.

గుంజాలలో గోండి లిపి రీసర్చ్ సెంటర్ భవన నిర్మాణానికి వెంటనే రూ.20 లక్షల నిధులు విడుదల చేయాలని ఐటీడీఏ పీవో ప్రశాంత్‌పాటిల్‌ను ఆదేశించారు. గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ, 5 సంవత్సరాల నుంచి 85 ఏళ్ల ముసలి వరకు గోండి లిపిలో అక్షరాస్యత సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలోని 17 పాఠశాలల్లో గుంజాల గోండి లిపిలో బోధన కొనసాగుతోందని, లిపిలో మొదటి వాచకాన్ని సైతం రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆదివాసీలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దళిత, ఆదివాసీ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.సర్‌రాజు, ఆర్డీవో ఐల్లయ్య, ఏజెన్సీ జిల్లా విద్యాధికారి సనత్‌కుమార్, గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్లు మనోజ, స్కాలర్లు, ఎంపీడీవో రాథోడ్ రవీందర్, తహశీల్దార్ మల్లయ్య, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.

కృషితోనే ఇంతటి ప్రాధాన్యం
ఉట్నూర్ రూరల్ : గోండి భాష పరిరక్షణ, అభివృద్ధి కృషితోనే ఆ భాషకు ఇంతటి ప్రాధాన్యం దక్కుతోందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ‘4వ జాతీయ గోండి భాష ప్రామాణికం’ వర్క్‌షాప్ సోమవారం ముగిసిం ది. కలెక్టర్ హాజరయ్యారు. ఐటీడీఏ ద్వా రా భాష అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement